Rajashree Swain : ఒడిశాకు చెందిన రాజశ్రీ స్వెయిన్ అనే మహిళా క్రికెటర్ అనుమానస్పద రీతిలో మరణించింది. అదృశ్యమైన మరుసటి రోజే ఆమె మృత్యువాతపడింది. కటక్ సిటీ సమీపంలోని దట్టమైన అడవిలో శుక్రవారం క్రికెటర్ మృతదేహాన్ని పోలీసులు కనుగొన్నారు. రాజశ్రీ మృతదేహం గురుడిఝాటియా అడవిలోని ఒక చెట్టుకు వేలాడుతూ కనిపించింది. అసహజమైన మరణంగా గురుడిఘాటియా పోలీసులు కేసు నమోదు చేశారని కటక్ డిఎస్పీ పినాక్ మిశ్రా తెలిపాడు. ఆమె మరణానికి కారణం ఏంటనేది తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టారు. అయితే.. తమ కూతురును ఎవరో హత్య చేశారని రాజశ్రీ కుటుంబసభ్యులు ఆరోపించారు. రాజశ్రీ మృతదేహంపై పలు చోట్ల గాయాలు ఉన్నాయి. అంతేకాదు ఆమె కళ్లు కూడా దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి కొంత దూరంలో రాజశ్రీ స్కూటీ కనిపించింది. అంతేకాదు ఆమె ఫోన్ కూడా స్విఛాఫ్ వస్తోంది.
జనవరి 11వ తేదీ నుంచి రాజశ్రీ అదృశ్యమైంది. దాంతో ఆమె కోచ్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశాడు. మరుసటి రోజే ఆమె విగతజీవిగా కనిపించింది. రాజశ్రీ అనుమానాస్పద రీతిలో మృతి చెందడం పలు అనుమానాలకు తావిస్తోంది. దాంతో అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తండ్రి దగ్గరకు వెళ్తున్నానని చెప్పి..
‘త్వరలోనే పుదుచ్చేరిలో జరగనున్న జాతీయ స్థాయి టోర్నమెంట్ కోసం ఒడిశా క్రికెట్ సంఘం (ఓసీఏ) బజ్రకబటి ప్రాంతంలో ట్రైనింగ్ క్యాంప్ నిర్వహించింది. రాజశ్రీతో పాటు 25 మంది ఎంపికయ్యారు. వాళ్లంతా అక్కడే ఒక హోటల్లో ఉంటున్నారు’ అని రాజశ్రీ కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. జనవరి 10న నేషనల్ టోర్నమెంట్‌కు ఎంపికైన వాళ్ల పేర్లను ఓసీఏ ప్రకటించింది. ఆ జాబితాలో రాజశ్రీ పేరు లేదు. దాంతో మనోవేదనకు గురైన ఆమె అదృశ్యం అయినట్టు తెలుస్తోంది. మరునాడు అందరూ ప్రాక్టీస్‌కు వెళ్లారు. తాను పూరీలోని తండ్రి దగ్గరకు వెళ్తున్నట్టు రాజశ్రీ కోచ్‌తో చెప్పింది. అయితే.. ఆమె ఇంటికి వెళ్లలేదని తెలియడంతో కోచ్ పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ నమోదు చేశారు.