Mirabai Chanu : భారత స్టార్ వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చానూ (Mirabai Chanu) మరో పతకంతో మెరిసింది. టోక్యో ఒలింపిక్స్లో కంచు మోత మోగించిన ఆమె ఈసారి కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్(Commonwealth Championships)లో రికార్డు బ్రేకింగ్ ప్రదర్శనతో స్వర్ణం కొల్లగొట్టింది. అహ్మదాబాద్లో సోమవారం జరిగిన 48 కిలోల ఫైనల్లో మీరా తన పవర్ చూపిస్తూ.. 193 కిలోలు ఎత్తి పసిడి పతకం పట్టేసింది. వరల్డ్ ఛాంపియన్షిప్స్లో సత్తా చాటాలనుకుంటున్న మీరాకు ఈ విజయం వెయ్యి ఏనుగల బలాన్ని ఇవ్వనుందనడంలో అతిశయోక్తి లేదు.
పారిస్ ఒలింపిక్స్లో నిరాశపరిచిన మీరాబాయి ఏడాది కాలంగా వెయిట్ లిఫ్టింగ్కు దూరంగా ఉంది. కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్ కోసం మళ్లీ బరువులు ఎత్తిన ఆమె తన శక్తికి మించిన ప్రదర్శన కనబరచాలనుకుంది. తొలి ప్రయత్నంలో 84 కిలోలు ఎత్తిన మీరా.. రెండోసారి ఏకంగా 109 కిలోలు ఎత్తి విజేతగా నిలిచింది.
𝐌𝐢𝐫𝐚𝐛𝐚𝐢 𝐂𝐡𝐚𝐧𝐮 𝐰𝐢𝐧𝐬 𝐂𝐨𝐦𝐦𝐨𝐧𝐰𝐞𝐚𝐥𝐭𝐡 𝐂𝐡𝐚𝐦𝐩𝐢𝐨𝐧𝐬𝐡𝐢𝐩𝐬 𝐆𝐨𝐥𝐝
Tokyo Olympics silver medallist Mirabai Chanu lifted a total weight of 193 kg to win a gold medal🥇 at the Commonwealth Weightlifting Championships in Ahmedabad.… pic.twitter.com/cAHqsv60nP
— All India Radio News (@airnewsalerts) August 25, 2025
‘అహ్మదాబాద్లో స్వర్ణ పతకం గెలుపొందండం చాలా సంతోషంగా ఉంది. పారిస్ ఒలింపిక్స్ తర్వాత దాదాపు ఏడాదికి సొంతగడ్డపై గోల్డ్ మెడల్ సాధించడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తోంది. ఇక్కడి ప్రేక్షకులు ఇచ్చిన మద్దతు నాకు కొండంత బలాన్ని ఇచ్చింది. నిరంతర శ్రమ వల్లనే ఈ విజయం సాధ్యమైంది. నా కోచ్ సూచనలు, దేశ ప్రజల మద్దతు నాకు ఎంతో ప్రేరణ ఇచ్చాయి. ఈ మెడల్తో వచ్చిన ఆత్మవిశ్వాసంతో అక్టోబర్లో జరుగబోయే ప్రపంచ ఛాంపియన్షిప్స్ పోటీలకు రెట్టించిన ఉత్సాహంతో సన్నద్ధమవుతాను. అంతర్జాతీయ వేదికపై మనదేశం గర్వపడేలా చేసేందుకు సర్వశక్తులు ఒడ్డుతాను’ అని మీరాబాయి తెలిపింది.
ఐదేళ్ల తర్వాత మీరాబాయి 48 కిలోలకు మారింది. 2018 నుంచి 49 కిలోల విభాగంలో పోటీపడుతున్న ఆమె పారిస్ విశ్వక్రీడల్లో నాలుగో స్థానంతో సరిపెట్టుకుంది. దాంతో, ఒక కిలో తగ్గించుకున్న మీరా.. కామన్వెల్త్ ఛాంపియన్షిప్స్లో అంచనాలకు మించి రాణించి పసిడిని ముద్దాడింది. మలేషియాకు చెందిన ఇరెనే హెన్రీకి రజతం, నికోలే రాబర్ట్స్(వేల్స్)కు కాంస్యం లభించింది.