హైదరాబాద్, జనవరి 22 : రాష్ట్రంలో క్రీడా మైదానాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులను ఆదేశించారు. శనివారం హైదరాబాద్‌లోని తన కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు దేశంలో అత్యుత్తమ క్రీడా పాలసీ రూపకల్పనపై మంత్రివర్గ సమావేశంలో చేసిన సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులకు సూచించారు. ముసాయిదా క్రీడా పాలసీని వచ్చే మంత్రివర్గ ఉప సంఘ సమావేశంలో సభ్యుల ముందు ప్రవేశపెట్టాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో క్రీడా మైదానాల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగంగా పూర్తి చేయాలని, ఇంకా ప్రారంభానికి నోచుకొని క్రీడా మైదానాల పనులకు వెంటనే శంకుస్థాపన చేసేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.