బెంగళూరు: మిడిలార్డర్ బ్యాటర్లు షెల్డన్ జాక్సన్ (160), అర్పిత్ వసవాడా (112 బ్యాటింగ్) సెంచరీలు నమోదు చేయడంతో కర్ణాటకతో జరుగుతున్న రంజీ ట్రోఫీ సెమీఫైనల్లో సౌరాష్ట్ర దీటుగా బదులిస్తున్నది. మొదట బ్యాటింగ్ చేసిన కర్ణాటక.. మయాంక్ డబుల్ సెంచరీ సాయంతో తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు చేసింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌరాష్ట్ర శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి 4 వికెట్లకు 364 పరుగులు చేసింది. చేతిలో ఆరు వికెట్లు ఉన్న సౌరాష్ట్ర.. ప్రత్యర్థి స్కోరుకు ఇంకా 43 పరుగులు వెనుకబడి ఉంది.
మధ్యప్రదేశ్‌తో జరుగుతున్న మరో సెమీఫైనల్ పోరులో బెంగాల్ విజయం దిశగా సాగుతున్నది. బెంగాల్ తొలి ఇన్నింగ్స్‌లో 438 పరుగుల భారీ స్కోరు చేయగా.. బదులుగా మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 170 రన్స్‌కే ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బెంగాల్ 59/2తో నిలిచింది. మరో రెండు రోజుల ఆట మిగిలిఉన్న పోరులో ప్రస్తుతం బెంగాల్ 327 పరుగుల ఆధిక్యంలో ఉంది.