మెల్బోర్న్: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, కామెంటేటర్ మైఖేల్ స్లేటర్(Michael Slater).. గృహ హింస కేసులో ప్రస్తుతం జైలు జీవితం అనుభవిస్తున్నాడు. అయితే రిహాబిలిటేషన్‌లో చేరేందుకు అతను తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం స్లేటర్.. బెయిల్ కోసం శ్రమిస్తున్నట్లు తెలుస్తోంది. మాజీ టెస్టు క్రికెటర్ స్లేటర్.. ఓ మహిళపై అటాక్ చేసిన ఘటనలో జైలు పాలయ్యాడు. ఆమెకు వందల సంఖ్యలో అసభ్యకరమైన మెసేజ్‌లు చేసినట్లు కూడా ఆరోపణలు ఉన్నాయి. ఏప్రిల్‌లో అతన్ని అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆ మాజీ క్రికెటర్ రిమాండ్‌లోనే ఉన్నారు.
స్లేటర్ పెట్టుకున్న బెయిల్ అభ్యర్థనపై ఇవాళ కోర్టులో విచారణ జరిగింది. న్యూ సౌత్ వేల్స్‌లోని రెసిడెన్షియల్ రిహాబిలిటేషన్ క్లినిక్‌లో చేరనున్నట్లు ఆయన తరపు లీగల్ బృందం పేర్కొన్నది. ఒకవేళ బెయిల్ ఇస్తే తన క్లయింట్ పూర్తి స్థాయిలో పునరావాస కేంద్రానికి వెళ్తారని బారిస్టర్ గ్రెగ్ మెక్గ్యూర్ తెలిపారు. స్లేటర్ కేసులో 2025 వరకు క్రిమినల్ కోణంలో విచారణ ఉండకపోవచ్చు అని బ్రిస్బేన్ సుప్రీంకోర్టు తెలిపింది. దీంతో ఆయన ఎక్కువ కాలం జైలులో ఉండే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లేందుకు స్లేటర్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.