Sanjay Manjrekar : ఐపీఎల్ 2023 వేలం మూడు రోజుల్లో ప్రారంభం కానుంది. దాంతో, వేలంలో ఏయే ఆటగాళ్లను దక్కించుకోవాలి అనేదానిపై అన్ని జట్లు కసరత్తు చేస్తున్నాయి. ఐదుసార్లు ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కూడా మ్యాచ్‌ను మలుపు తిప్పగల లెగ్ స్పిన్నర్ చూస్తోంది. ‘ఈసారి వేలంలో రషీద్ ఖాన్, సునీల్ నరైన్ లాంటి లెగ్ స్పిన్నర్‌ను దక్కించుకునేందుకు ముంబై ఫ్రాంఛైజీ ఎదురుచూస్తోంది. ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడం జంపా లేదంటే ఇంగ్లండ్ బౌలర్ ఆదిల్ రషీద్‌లు ఆ జాబితాలో ముందుంటారు. మిగతా అన్ని విభాగాలు బాగానే ఉన్నాయి’అని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ అభిప్రాయపడ్డాడు. ఆయన స్టార్ స్టోర్ట్స్ గేమ్ ప్లాన్ – ఆక్షన్ స్పెషల్ షోలో మాట్లాడాడు.
రషీద్ ఖాన్ డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటల్స్ తరఫున ఆడుతున్నాడు. సునీల్ నరైన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ అట్టిపెట్టుకుంది. వీళ్లిద్దరూ మిడిల్ ఓవర్లలో బ్యాటర్లను కట్టడి చేయడమే కాకుండా వికెట్లు తీయగలరు. ఐపీఎల్ 2023 వేలం డిసెంబర్ 23న కొచ్చిలో జరగనుంది.
ఐదు సార్లు ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన ముంబై ఇండియన్స్‌కు పోయిన ఏమంత కలిసి రాలేదు. అన్ని విభాగాల్లోనూ ఆ జట్టు తేలిపోయింది. ఐపీఎల్ కెరీర్లోనే చెత్త ప్రదర్శన కనబరిచి పాయింట్ల పట్టికలో ఈ జట్టు అట్టడుగున నిలిచింది. దాంతో ఈ సీజన్లో ముంబై మళ్లీ మునపటి ఆటను కొనసాగించాలనే పట్టుదలతో ఉంది. ముంబై ఇండియన్స్ 2013, 2015, 2017, 2019, 2020 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచింది.