ముంబై జట్టు కష్టాల్లో పడింది. బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన జట్టుకు రోహిత్ శర్మ (26), ఇషాన్ కిషన్ (26) మంచి ఆరంభమే ఇచ్చారు. ఇద్దరూ చక్కగా బ్యాటింగ్ చేయడంతో వికెట్లేమీ కోల్పోకుండా 49 పరుగుల చేసి పవర్‌ప్లే ముగించిందా జట్టు. కానీ ఆ తర్వాతి ఓవర్లోనే హర్షల్ పటేల్ ముంబైను కోలుకోలేని దెబ్బతీశాడు. మంచి ఫ్లోలో కనిపిస్తున్న రోహిత్‌ను అవుట్ చేశాడు.
ఆ తర్వాత కూడా నిలకడగానే సాగిన ముంబై ఇన్నింగ్స్‌ను హసరంగ మరో దెబ్బ కొట్టాడు. ‘బేబీ ఏబీ’గా పిలుచుకునే డెవాల్డ్ బ్రెవిస్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత పదో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన ఆకాష్ దీప్.. రెండో బంతికే ఇషాన్ కిషన్‌ను పెవిలియన్ చేర్చాడు. థర్డ్‌మ్యాన్ వైపు కిషాన్ కొట్టిన బంతిని సిరాజ్ అద్భుతంగా క్యాచ్ పట్టేయడంతో అతను పెవిలియన్ చేరాడు. అదే ఓవర్ ఐదో బంతికి మ్యాక్స్‌వెల్ సూపర్ ఫీల్డింగ్‌తో తిలక్ వర్మ (0)ను అవుట్ చేశాడు.
దీంతో నాలుగు వికెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. వీటిని మరింత పెంచుతూ 11వ ఓవర్ తొలి బంతికే కీరన్ పొలార్డ్ (0)ను గోల్డెన్‌డక్‌గా హరసరంగ అవుట్ చేశాడు. ఎల్బీడబ్ల్యూ అవుటన్న అంపైర్ నిర్ణయాన్ని పొలార్డ్ సవాల్ చేస్తూ రివ్యూ కోరాడు. కానీ నిర్ణయంలో మాత్రం ఎటువంటి మార్పు రాలేదు. దీంతో పొలార్డ్ పరుగులేమీ చేయకుండానే వెనుతిరిగాడు.
దీంతో 11 ఓవర్లు ముగిసేసరికి ముంబై జట్టు ఐదు వికెట్ల నష్టానికి 64 పరుగులతో నిలిచింది. ప్రస్తుతం క్రీజులో ఉన్న సూర్యకుమార్ యాదవ్‌పైనే ముంబై అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. జట్టుకు గౌరవప్రదమైన స్కోరు అందించాల్సిన బాధ్యత అతనిపై పడింది.