ముంబై: ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన జట్టుగా ఉన్న ముంబై ఇండియన్స్ 18వ ఎడిషన్‌లో టైటిల్ వేటకు శ్రీకారం చుట్టింది. రెండు వరుస పరాభవాల అనంతరం ఆ జట్టు.. సోమవారం వాంఖడే స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) పై 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. వాంఖడేలో కేకేఆర్‌పై ఘనమైన రికార్డు కలిగిన ముంబై.. ఆ పరంపరను కొనసాగిస్తూ సూపర్ విక్టరీతో బోణీ కొట్టింది. ఐపీఎల్లో అరంగేట్ర మ్యాచ్ ఆడిన యువ పేసర్ అశ్వినీ కుమార్ (4/24), దీపక్ చాహర్ (2/19) పేస్ దెబ్బకు కేకేఆర్.. 16.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. అంగ్క్రిష్ రఘువంశీ (16 బంతుల్లో 26, 3 ఫోర్లు, 1 సిక్స్), రమణ్‌దీప్ సింగ్ (12 బంతుల్లో 22, 1 ఫోర్, 2 సిక్సర్లు) మిగిలిన బ్యాటర్ల కంటే ఉన్నంతలో మెరుగ్గా రాణించారు. ఛేదనలో ర్యాన్ రికెల్టన్ (41 బంతుల్లో 62 నాటౌట్, 4 ఫోర్లు, 5 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (9 బంతుల్లో 27 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) వేగంగా ఆడారు. అశ్వినీ కుమార్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
దంచిన రికెల్టన్
స్వల్ప ఛేదనలో ముంబైకి ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన రోహిత్ (13) మరోసారి నిరాశపరచగా యువ ఓపెనర్ రికెల్టన్ మాత్రం చెలరేగి ఆడాడు. జాన్సన్ 3వ ఓవర్లో 4, 6తో పరుగుల వేట ఆరంభించిన ఈ దక్షిణాఫ్రికా కుర్రాడు.. హర్షిత్ రాణా నాలుగో ఓవర్లో 4, 6, 4 బాదాడు. నరైన్ పదో ఓవర్లో భారీ సిక్సర్ కొట్టి అర్ధ సెంచరీ పూర్తిచేసిన అతడు అదే ఓవర్లో లాంగాన్ మీదుగా మరో సిక్సర్ బాదాడు. విల్ జాక్స్ (16) విఫలమైనా నాలుగో స్థానంలో వచ్చిన సూర్య దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ముగించాడు. ఎదుర్కున్న రెండో బంతినే సిక్సర్‌గా మలిచిన మిస్టర్ 360.. రస్సెల్ 13వ ఓవర్లో 4, 4, 6తో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
కోల్‌కతా కట్టడి
బ్యాటింగ్ వైఫల్యంతో కోల్‌కతాకు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తాకాయి. తొలి ఓవర్లోనే ప్రత్యర్థులను బెంబేలెత్తించే బౌల్ట్ (1/23) వేసిన ఇన్నింగ్స్ నాలుగో బంతికి సునీల్ నరైన్ (0) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. రెండో ఓవర్లో చాహర్.. తొలి బంతికే డికాక్ (1)నూ పెవిలియన్‌కు పంపాడు. నాలుగో ఓవర్లో సారథి హార్దిక్ నుంచి బంతినందుకున్న అశ్వినీ.. తొలి బంతికే రహానే (11)ను ఔట్ చేసి ఐపీఎల్లో తన ఆగమనాన్ని ఘనంగా చాటాడు. రహానే ఇచ్చిన క్యాచ్‌ను డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద తిలక్ వర్మ సూపర్ క్యాచ్ పట్టాడు. చాహర్ ఆరో ఓవర్లో వెంకటేశ్ అయ్యర్ (3)నూ బోల్తా కొట్టించడంతో కేకేఆర్ కష్టాలు రెట్టింపయ్యాయి. ముంబై బౌలర్లపై ఎదురుదాడికి దిగిన రఘువంశీ.. హార్దిక్ వేసిన ఏడో ఓవర్లో నమన్‌కు క్యాచ్ ఇచ్చాడు. 45 పరుగులకే ఐదు కీలక వికెట్లు కోల్పోయిన నైట్ రైడర్స్ తర్వాత ఏ దశలోనూ కోలుకోలేదు. 11వ ఓవర్లో అశ్వినీ.. రింకూ సింగ్ (17), మనీష్ పాండే (19) నూ ఔట్ చేశాడు. రస్సెల్ (5) కూడా అతడి బాధితుడే. ఆఖర్లో రమణ్‌దీప్ పుణ్యమా అని కేకేఆర్ వంద పరుగుల మార్కును దాటింది.
ఐపీఎల్ అరంగేట్ర మ్యాచ్‌లో 4 వికెట్ల ప్రదర్శన చేసిన తొలి భారత బౌలర్ అశ్వినీ
సంక్షిప్త స్కోర్లు