FIFA World Cup : ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్లో అడుగుపెట్టిన అర్జెంటీనా టైటిల్ గెలవాలని ఆ దేశ ప్రజలంతా గట్టిగా కోరుకుంటున్నారు. ఆ జట్టు స్టార్ ఆటగాడు లియోనల్ మెస్సీకి ఇది రెండో వరల్డ్ కప్ ఫైనల్. దాంతో, ఈసారి అతను జట్టుకు కప్పు అందించాలని అతని పదేళ్ల కుమారుడు థియాగో ఆశిస్తున్నాడు. అందుకని ఫైనల్ సందర్బంగా నాన్నకు మద్దతుగా అతను ఒక లెటర్ రాశాడు. అందులో అర్జెంటీనా థీమ్ సాంగ్ ముచాచోస్లోని కొన్ని పదాలు ఉన్నాయి. ఈ లెటర్‌ను మెస్సీ భార్య ఆంటోనెల రొకుజో ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసింది. ‘అబ్బాయిలు.. మనకు కప్పు సాధించే అవకాశం మళ్లీ వచ్చింది’ అని థియాగో అందులో రాశాడు. సెమీఫైనల్లో 3-0తో క్రొయేషియాను ఓడించాక అర్జెంటీనా ఆటగాళ్లు ముచాచోస్ పాట పాడుతూ సంబరాలు చేసుకున్నారు. వీడియో కూడా చేశారు.
మెస్సీ నాయకత్వంలోని అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్‌కు చేరడం ఇది రెండోసారి. 2014లో బ్రెజిల్లో జరిగిన ప్రపంచకప్‌లో ఆ జట్టు జర్మనీ చేతిలో 1-0తో ఓటమి పాలైంది. దాంతో వరల్డ్ కప్ గెలవాలన్న మెస్సీ కల చెదిరింది. ఫుట్‌బాల్ ఆటలో ఎన్నో ఘనతలు సొంతం చేసుకున్న మెస్సీకి వరల్డ్ కప్ ట్రోఫీ లోటు మాత్రం ఉండిపోయింది. దాంతో ఈసారి అతను తన కలను నిజం చేసుకోవాలని అనుకుంటున్నాడు. జట్టు సభ్యులు కూడా ట్రోఫీ సాధించి మెస్సీకి ఘనంగా వీడ్కోలు పలకాలని భావిస్తున్నారు.