Lionel Messi : ఫుట్‌బాల్ అభిమానులకు మరో షాకింగ్ న్యూస్. భారత గడ్డపై ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2లో ఆడేందుకు క్రిస్టియానో రొనాల్డో (Cristiano Ronaldo) అనాసక్తి చూపించగా.. వెటరన్ లియోనల్ మెస్సీ (Lionel Messi) రాక సైతం వాయిదా పడింది. మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా టీమ్ నవంబర్‌లో కేరళకు రావాల్సి ఉంది. కానీ, అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య నుంచి ఇంకా అనుమతి రాలేదు. దాంతో.. ఫ్రెండ్లీ మ్యాచ్ ఆలస్యం కానుందని ఈవెంట్ స్పాన్సర్ వర్గాలు తెలిపాయి.
అర్జెంటీనా, కేరళ జట్ల మధ్య కొచ్చిలో జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ వాయిదా గురించి కేరళ ప్రభుత్వం, క్రీడా శాఖతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతలు చూసుకున్న ఆంటో ఆగస్టిన్ వెల్లడించాడు. ‘షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17న కేరళ టీమ్‌తో అర్జెంటీనా తలపడాల్సి ఉంది. కానీ, మెస్సీ రాక వాయిదా పడడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ జరగకపోవచ్చ’ని ఆగస్టిన్ తెలిపాడు.
Messi won’t come to Kerala next month ❌️ confirms Reporter TV MD Anto Augustine
Agreement reached in discussions with AFA to postpone the November window game considering the delay in obtaining FIFA approval
Playing in Kerala in the next window#KBFCl #IndianFootball pic.twitter.com/9tyjqVfhpe— Abdul Rahman Mashood (@abdulrahmanmash) October 25, 2025
మెస్సీ రాకపై నెలకొన్న అనిశ్చితిపై కేరళ క్రీడా మంత్రి అబ్దురహిమన్ స్పందిస్తూ.. ‘అర్జెంటీనా జట్టు నవంబర్‌లో రెండు ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. అంగోలాతో మెస్సీ టీమ్ ఆడనుంది. కానీ, కొచ్చితో మ్యాచ్‌పైనే స్పష్టత రావాల్సి ఉంది’ అని పేర్కొన్నారు. ఈ సంగతి తెలియగానే పద్నాలుగేళ్ల తర్వాత తమ అభిమాన ఆటగాడిని ప్రత్యక్షంగా చూసేందుకు నిరీక్షిస్తున్న అభిమానులు నిరాశలో మునిగిపోయారు.
ఏఎఫ్సీ ఛాంపియన్స్ లీగ్ 2లో రొనాల్డో సారథ్యం వహిస్తున్న అల్ నస్రీ క్లబ్ గ్రూప్ డీలో ఉంది. అయితే.. గత రెండు మ్యాచుల్లో ఈ ఫార్వర్డ్ ప్లేయర్ లేకుండానే బరిలోకి దిగిన అల్ నస్రీ జట్టు రెండింటా గెలుపొందింది. దాంతో.. కెప్టెన్ లేకుండానే 28 మందితో కూడిన అల్ నస్రీ బృందం సోమవార రాత్రి గోవా చేరుకుంది.