Lionel Messi : ఫుట్‌బాల్ అభిమానులకు గుడ్‌న్యూస్. కొచ్చి పర్యటన రద్దు చేసుకున్న లియోనల్ మెస్సీ (Lionel Messi) GOAT టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా హైదరాబాద్ రానున్నాడు. డిసెంబర్లో భారత్‌కు రానున్న మెస్సీ హైదరాబాద్‌తో పాటు ముంబై, కోల్‌కతా, న్యూ ఢిల్లీలో పర్యటించనున్నాడు. ఈ విషయాన్ని ఈ టూర్‌ను ఆర్గనైజ్ చేస్తున్న శతద్రు దత్తా(Satadru Dutta) శనివారం అధికారికంగా ధ్రువీకరించాడు.
‘అర్జెంటీనా సారథి మెస్సీ నవంబర్లోకొచ్చిలో కేరళతో మ్యాచ్ ఆడాల్సింది. కానీ, ఆ పర్యటన వాయిదా పడడంతో కొత్త షెడ్యూల్ ఖరారైంది. ఎట్టకేలకు సుదీర్ఘ బ్రేక్ తర్వాత మెస్సీ భారత్‌కు వచ్చేస్తున్నాడు. దక్షిణ భారతదేశంలోని లక్షలాది మంది అభిమానులను అలరించేందుకు అతడు డిసెంబర్లో GOAT టూర్ ఆఫ్ ఇండియాలో భాగంగా పలు నగరాలకు రానున్నాడు. ఈ పర్యటనతో భారత్‌లోని ప్రధాన నగరాలు, అన్ని ప్రాంతాల్లోని అభిమానులకు మెస్సీని చూసే అదృష్టం దక్కనుంది.
డిసెంబర్ 12న అర్ధరాత్రి లేదా డిసెంబర్ 13న దుబాయ్ మీదుగా మెస్సీ కోల్‌కతా చేరుకుంటాడు. అదే రోజు సాయంత్రం అతడు హైదరాబాద్ వస్తాడు. డిసెంబర్ 14న ముంబై, 15వ తేదీన ఢిల్లీలో వాలిపోతాడు. ఈ పర్యటనలో మెస్సీ ప్రధాని నరేంద్ర మోడీని కలిసే అవకాశముంది. ‘ అని దత్తా వెల్లడించాడు.
“His arrival will have positive effect on football ecosystem”: Satadru Dutta, the man who is bringing Lionel Messi to India
Read @ANI Story | https://t.co/HV49IOjVdY#LionelMessi #SatadruDutta #IndianFootball pic.twitter.com/n3S0dTBpGe
— ANI Digital (@ani_digital) October 26, 2025
అర్జెంటీనా, కేరళ జట్ల మధ్య కొచ్చిలో జరగాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ వాయిదా గురించి కేరళ ప్రభుత్వం, క్రీడా శాఖతో కలిసి ఫ్రెండ్లీ మ్యాచ్‌ల నిర్వహణ బాధ్యతలు చూసుకున్న ఆంటో ఆగస్టిన్ వెల్లడించాడు. ‘షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17న కేరళ టీమ్‌తో అర్జెంటీనా తలపడాల్సి ఉంది. కానీ, మెస్సీ రాక వాయిదా పడడంతో అనుకున్న సమయానికి మ్యాచ్ జరగకపోవచ్చ’ని ఆగస్టిన్ తెలిపాడు.
అర్జెంటీనా జట్టు 2026 వరల్డ్ కప్ పోటీలకు క్వాలిఫై అయినప్పటి నుంచి మెస్సీ గురించే చర్చ నడుస్తోంది. రెండుసార్లు జట్టును ఫైనల్ చేర్చి.. గత సీజన్లో ట్రోఫీ అందించిన అతడు మరో వరల్డ్ కప్ ఆడాలని యావత్ దేశం కోరుకుంటోంది. ఈ నేపథ్యంతో మెస్సీ కూడా ‘ఔను.. నాకూ ఆడాలని ఉంది’ అని అభిమానులను సంబురాల్లో ముంచెత్తాడు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘వరల్డ్ కప్‌లో ఆడడంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను. నా పరిస్థితిని రోజు రోజుకు గమనిస్తూ.. అందుబాటులో ఉంటానో లేనో చెబుతాను. ఇప్పటికైతే మెగా టోర్నీ కసం వంద శాతం సిద్దంగా ఉండేందుకు, అర్జెంటీనాకు ఉపయోగపడేందుకు ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే.. ప్రపంచకప్‌లో ఆడడం అసాధారణమైన విషయం. నేను మెగా టోర్నీని ఎంతగానో ఇష్టపడుతాను’ అని మెస్సీ వెల్లడించాడు.