ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో ఆసక్తికర పోరు అభిమానులను అలరించింది. సెమీస్ బెర్త్ కోసం రష్యా స్టార్ ప్లేయర్ డానిల్ మెద్వెదెవ్, ఫెలిక్స్ అగుర్ కొదమసింహాల్లా కొట్లాడారు. వరుసగా తొలి రెండు సెట్లు కోల్పోయి వెనుకంజ వేసిన మెద్వెదెవ్ అద్భుతంగా పుంజుకున్నాడు. తన అనుభవాన్ని ఉపయోగిస్తూ ప్రత్యర్థిపై విరుచుకుపడగా.. ఫెలిక్స్ కూడా దీటైన పోటీనివ్వడంతో మ్యాచ్ ఆఖరి వరకు రసవత్తరంగా సాగింది. మూడో సెట్‌ను టై బ్రేక్‌లో దక్కించుకున్న మెద్వెదెవ్ వెనుదిరిగి చూడలేదు. పవర్ఫుల్ సర్వ్‌లకు తోడు బేస్‌లైన్ గేమ్‌తో పాయింట్లు కొల్లగొట్టి మ్యాచ్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. మరో క్వార్టర్స్‌లో గ్రీస్ వీరుడు సిట్సిపాస్.. సిన్నర్‌పై విజయంతో సెమీస్‌లోకి దూసుకెళ్లగా.. మహిళల పోరులో స్వియాటెక్, కొలిన్స్ టైటిల్‌కు రెండడుగుల దూరంలో ఉన్నారు.
మెల్బోర్న్: సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ టోర్నీ ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో రష్యన్ టెన్నిస్ స్టార్ డానిల్ మెద్వెదెవ్ సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో మెద్వెదెవ్ 6-7 (4/7), 3-6, 7-6 (7/2), 7-5, 6-4తో ఫెలిక్స్అగుర్ అలిసిమి (కెనడా)పై పోరాడి గెలిచాడు. 4 గంటలా 42 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో రష్యా ఆటగాడు భారీ సర్వీస్‌లతో గేమ్‌ను తన వైపునకు తిప్పేసుకున్నాడు. తొలి రెండు సెట్లలో మెద్వెదెవ్కు షాకిస్తూ అగుర్ ఆధిక్యంలోకి వచ్చాడు. అనంతరం కీలకమైన మూడో సెట్లో మెద్వెదెవ్ అనూహ్యంగా పుంజుకున్నాడు. ఇద్దరూ సర్వ్‌లను కాపాడుకోవడంతో సెట్ ‘టై’ బ్రేక్‌కు దారి తీసింది. నాలుగో సెట్లో ఇద్దరూ పాయింట్ల కోసం తీవ్రంగా శ్రమించారు. 5-4గా ఉన్న దశలో ఫెలిక్స్ బాదిన మ్యాచ్ పాయింట్‌ను మెద్వెదెవ్ కాపాడుకోవడంతో మ్యాచ్ అనూహ్య మలుపు తీసుకుంది. 11వ గేమ్‌లో కెనడా ప్లేయర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన మెద్వెదెవ్ వెంటనే సర్వ్‌ను కాపాడుకుని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణయాత్మక ఆఖరి సెట్‌ను కైవసం చేసుకుని మెద్వెదెవ్ విజేతగా నిలిచాడు. మరో మ్యాచ్‌లో నాలుగో సీడ్ స్టెఫానోస్ సిట్సిపాస్ (గ్రీస్) 6-3, 6-4, 6-2తో 11వ సీడ్ సిన్నర్ (ఇటలీ)పై అలవోక విజయంతో సెమీస్ బెర్త్ ఖాయం చేసుకున్నాడు. 2 గంటలా 6 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సిట్సిపాస్ ప్రత్యర్థికి ఏమాత్రం పోరాడే అవకాశం ఇవ్వలేదు.
సెమీస్‌లో స్వియాటెక్, కొలిన్స్
మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ఏడో సీడ్ స్వీయాటెక్ (పోలాండ్) 4-6, 7-6 (7/2), 6-3తో కియా కనెపి (ఈస్తోనియా)పై నెగ్గి సెమీస్‌లోకి ప్రవేశించింది. మరో పోరులో అలిజా కార్నెట్ (ఫ్రాన్స్)కు నిరాశ ఎదురైంది. క్వార్టర్స్‌లో అలిజా 5-7, 1-6తో 27వ సీడ్ డానియెల్లి కొలిన్స్ (అమెరికా) చేతిలో ఓటమి పాలైంది. సెమీస్‌లో బార్టీతో, కీస్, కొలిన్స్, స్వియాటెక్ మధ్య సెమీస్ పోరు జరుగనుంది.