మారుతీనగర్, మే 4 : ఆర్మీ ఆర్చరీ స్పోర్ట్స్ ఇనిస్టిట్యూట్‌కు జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన మెడిచెల్మ సహస్ర ఎంపికైంది. ఆర్మీ గర్ల్స్ స్పోర్ట్స్ ర్యాలీ ఆధ్వర్యంలో పుణెలో జరిగిన ఆర్చరీ అండర్-14 విభాగంలో ప్రతిభ చాటిన సహస్ర తెలంగాణ నుంచి చోటు దక్కించుకుంది. మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి చెందిన మెడిచెల్మ రాజేశ్-సుస్మితకు ఇద్దరు కూతుళ్లు సహస్ర, అద్వైత. మార్కెటింగ్ ఉద్యోగం నేపథ్యంలో రాజేశ్ తన కుటుంబ సభ్యులతో కలిసి 20 ఏండ్ల కింద మెట్పల్లి పట్టణానికి వచ్చి స్థిరపడ్డారు. ఈ క్రమంలో పెద్ద కూతురు సహస్ర..ఆర్చరీలో చిన్ననాటి నుంచి మక్కువ చూపడంతో 2011 నుంచి కోచింగ్ ఇప్పించారు. అయితే మెరుగైన శిక్షణ కోసం హైదరాబాద్‌కు మకాం మార్చారు. 2023లో రంగారెడ్డి జిల్లా తరఫున అండర్-14 విభాగంలో ఉత్తమ ప్రతిభ చూపిన సహస్ర పసిడి పతకం సాధించింది.