Rohit Sharma | టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ త్వరలో జరుగనున్నవ విజయ్ హజారే ట్రోఫీలో అందుబాటులో ఉంటాడని, ముంబయి క్రికెట్ అసోసియేషన్‌కి సమాచారం అందించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే, మీడియా నివేదికలను ఎంసీఏకు చెందిన ఓ అధికారి తోసిపుచ్చారు. విజయ్ హజారే ట్రోఫీలో ఆడడంపై రోహిత్ నుంచి ఎలాంటి అప్డేట్ రాలేదని ఆయన జాతీయ మీడియా సంస్థకు తెలిపారు. ఈ విషయంలో ఎలాంటి చర్చలు జరగలేదన్నారు. వాస్తవానికి, వన్డే క్రికెట్లో కొనసాగాలనుకుంటే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ దేశీయ టోర్నీలో ఆడాలని బీసీసీఐ సూచించిందని పలు నివేదికలు తెలిపాయి. ఈ విషయంలో ఎంసీఏకు రోహిత్ సమాచారం అందించాడని పేర్కొన్నాయి. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో రోహిత్ శర్మ బ్యాట్‌తో రాణించాడు.
ఈ సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో ఓడిపోయినప్పటికీ.. రోహిత్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును అందుకున్నాడు. ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, హాఫ్ సెంచరీ సహాయంతో మూడు మ్యాచుల్లో 202 పరుగులు చేశాడు. చివరి మ్యాచ్‌లో అజేయంగా 121 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇక త్వరలో భారత జట్టు దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడుతుంది. తొలి మ్యాచ్ నవంబర్ 30న రాంచీలో జరుగుతుంది. రెండు, మూడో వన్డే డిసెంబర్ 3, 6 తేదీల్లో జరుగుతాయి. దేశవాళీ టోర్నమెంట్ విజయ్ హజారే ట్రోఫీ మ్యాచులు డిసెంబర్ 25 నుంచి జనవరి 18 మధ్య జరుగుతుంది. ఈ టోర్నీలోని అన్ని మ్యాచులు అహ్మదాబాద్, రాజ్‌కోట్, జైపూర్, బెంగళూరులో జరుగనున్నాయి. ఈ డొమెస్టిక్ టోర్నీలో రోహిత్, కోహ్లీ ఆడతారా? లేదా? అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. కానీ, కొద్దిరోజుల్లోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.