Matheesha Pathirana : శ్రీలంక యువ పేసర్ మథీష పథిరన(Matheesha Pathirana) పొట్టి క్రికెట్లో అరుదైన ఘనత సాధించాడు. ఐదు ఏండ్లగా చెక్కు చెదరని రికార్డు బద్ధలు కొట్టాడు. అఫ్గనిస్థాన్‌తో బుధవారం జరిగిన ఆఖరి టీ20లో పథిరన రెండు వికెట్లు తీసి.. ఒక టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన లంక బౌలర్‌గా అవతరించాడు. దాంతో, యార్కర్ కింగ్ లసిత్ మలింగ(Lasith Malinga) పేరిట ఉన్న రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.
అచ్చం మలింగ బౌలింగ్ యాక్షన్‌ను తలపించే పథిరన అఫ్గనిస్థాన్‌తో జరిగిన మూడు మ్యాచుల సిరీస్‌లో 8 వికెట్లు పడగొట్టాడు. దాంతో, మలింగ రెండో స్థానానికి పడిపోయాడు. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన మూడు టీ20ల సిరీస్‌లో మలింగ 7 వికెట్లు తీశాడు. అయితే.. 2002లో దుష్మంత చమీర కూడా ఆస్ట్రేలియాపై 7 వికెట్లు పడగొట్టి ఆ రికార్డును సమం చేశాడు.
లసిత్ మలింగ, పథిరన
దంబుల్లా స్టేడియంలో జరిగిన మూడో టీ20లో అఫ్గనిస్థాన్ ఓదార్పు విజయం సాధించింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో కాబూలీ జట్టు 3 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత ఆడిన అఫ్గనిస్థాన్ 5 వికెట్ల నష్టానికి 205 రన్స్ కొట్టగా.. అనంతరం లంక 206 పరుగులకే పరిమితమైంది. రహ్మనుల్లా గుర్బాజ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకోగా.. లంక కెప్టెన్ వనిందు హసరంగ ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డును దక్కించుకున్నాడు. తొలి రెండు టీ20ల్లో అఫ్గనిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన లంక 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది.