Match Fixing | మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల్లో ఇద్దరు దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్లు అరెస్టయ్యారు. మాజీ టెస్ట్ క్రికెటర్లు థామీలే సొత్సోలేకిలే, లోన్వాబో సొత్సోబే 2015లో దేశవాళీ టోర్నీలో మ్యాచ్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డారని ఆరోపణలున్నాయి. వీరిద్దరిపై ఆరోపణలు రుజువైతే భారీ శిక్షను విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఫిక్స్ నేపథ్యంలో క్రికెట్ ఆడకుండా నిషేధం విధించిన విషయం తెలిసిందే. మాజీ టెస్ట్ క్రికెటర్లు ఇద్దరినీ గత నెలలో అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రిటోరియాలోని ప్రత్యేక వాణిజ్య నేరాల కోర్టులో హాజరుపరిచిన తర్వాత దక్షిణాఫ్రికా అవినీతి నిరోధక చట్టం కింద మాజీ ఆటగాళ్లపై ఐదు అభియోగాలు మోపారు.
చట్టంలోని కొన్ని కేసుల్లో 18 సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుంది. 20 సంవత్సరాల కిందట దక్షిణాఫ్రికా తరఫున టెస్టులు ఆడిన 44 సంవత్సరాల థామీ 2016లో ఈ కేసులో 12 ఏళ్లపాటు నిషేధానికి గురయ్యాడు. 2009 నుంచి 2014 వరకు 89 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 131 వికెట్లు పడగొట్టిన సొత్సోబే 2017లో ఎనిమిదేళ్ల నిషేధానికి గురయ్యాడు. వీరిద్దరితో పాటు మరో దేశవాళీ క్రికెట్ ఎథి మ్భలాటి సైతం ఇదే ఫిక్సింగ్ కేసులో అరెస్ట్ అయ్యారు. ఈ క్రికెటర్లు రామ్‌స్లామ్ టీ20 టోర్నమెంట్లో దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ గులాం బోడి కారణంగా మ్యాచ్ ఫిక్సింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ కేసులో బోడికి ఐదేళ్ల శిక్ష పడింది.