లండన్ : పదహారేండ్ల క్రితం పాకిస్థాన్ క్రికెట్‌ను కుదిపేసిన ‘ఫిక్సింగ్’ కలకలం మరోసారి ఆ జట్టు మెడకు చుట్టుకుందా? ఇంగ్లండ్‌తో లార్డ్స్‌లో రెండో టెస్టులో బాబర్‌సేన దారుణ ఓటమి అనంతరం జరుగుతున్న పరిణామాలూ ఆ దిశగానే సాగుతున్నాయి. మ్యాచ్ ముగిశాక ఉన్నట్టుండి కోచింగ్ సిబ్బందిపై వేటు, ఏడుగురు ఆటగాళ్లను వెనక్కి పిలిపించడం, సెలక్షన్ ప్యానెల్ నుంచి మిస్బా ఉల్ హక్ తప్పుకోవడానికి తోడు తాజాగా ‘మ్యాచ్ ఫిక్సింగ్’ కోణంలోనూ వార్తలు వెలువడుతున్నాయి.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) సైతం ఇద్దరు ఆటగాళ్ల ఫోన్లను తమ స్వాధీనంలోకి తీసుకోవడమే గాక అంతర్గత దర్యాప్తునకు ఆదేశించడం ఈ అనుమానాలకు బలాన్ని చేకూరుస్తున్నది. పీసీబీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్న మాజీ క్రికెటర్ అకిబ్ జావేద్ స్పందిస్తూ.. ‘ఇమామ్ గాయం అనుమానాలకు తావిస్తున్నది. ఈ విషయంపై కఠినంగా వ్యవహరించాల్సి ఉంది. దీనిపై సమగ్ర విచారణ జరగాలి’ అని చెప్పాడు. 2010లో ఇదే లార్డ్స్ టెస్టులో నాటి సారథి సల్మాన్ భట్, బౌలర్లు మహ్మద్ ఆసిఫ్, మహ్మద్ ఆమిర్ ఫిక్సింగ్‌కు పాల్పడి కెరీర్లను నాశనం చేసుకున్న విషయం విదితమే.