దుబాయ్: రెండు నెలల క్రితం భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన టీ20 ప్రపంచకప్‌లో భాగంగా గ్రూప్ దశలో కెనడా, న్యూజిలాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఫిక్సింగ్ జరిగినట్టు ఆరోపణలు వచ్చాయి. ఫిబ్రవరి 17న చెపాక్ (చెన్నై) వేదికగా ఇరుజట్ల మధ్య జరిగిన పోరులో కెనడా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలవగా.. ఆ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడ్డట్టు ఆ దేశానికి చెందిన ‘ది ఫిఫ్త్ ఎస్టేట్’ రూపొందించిన డాక్యుమెంటరీ ఆరోపించింది.
మ్యాచ్ సందర్భంగా కెనడా సారథి దిల్‌ప్రీత్ బజ్వా వేసిన ఐదో ఓవర్ అనుమానాస్పదంగా మారిందని డాక్యుమెంటరీలో పేర్కొన్నారు. ప్రపంచకప్‌నకు సరిగ్గా మూడు వారాల ముందు సారథిగా నియమితుడైన బజ్వా.. ఐదో ఓవర్ వేసేటప్పటికీ కివీస్ స్కోరు 35/2గా ఉంది. ఆ ఓవర్లో తొలి బంతినే నోబాల్ వేసిన అతడు.. ఓ వైడ్‌తో కలుపుకుని మొత్తం 15 పరుగులిచ్చాడు.
అదే ఊపులో కివీస్ స్కోరువేగం పుంజుకుని గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర దంచికొట్టడంతో 174 పరుగుల ఛేదనను న్యూజిలాండ్ 15.1 ఓవర్లలోనే పూర్తిచేసింది. కాగా ఫిక్సింగ్ ఆరోపణల నేపథ్యంలో ఐసీసీ నాటి మ్యాచ్‌పై దృష్టిసారించింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఐసీసీ యాంటీ కరప్షన్ టీమ్‌లు రెండు విచారణను ప్రారంభించాయని బోర్డు వర్గాలు తెలిపాయి.
కెనడా మాజీ కోచ్ ఖుర్రమ్ చౌహాన్ పాత్రపైనా విచారణ సాగుతున్నట్టు సమాచారం. అతడు సెలక్షన్ కమిటీ సభ్యులకు ఫోన్‌చేసి ఫలానా క్రికెటర్లనే ఎంపిక చేయాలని చెప్పిన ఆడియో క్లిప్ ఒకటి లీక్ అవడంతో ఫిక్సింగ్ కోణంలో దీనిపై విచారణ చేపట్టినట్టు తెలుస్తున్నది.