గౌహతి: ఒకే టెస్టు మ్యాచ్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్‌గా మార్క్రమ్(Aiden Markram) రికార్డు క్రియేట్ చేశాడు. గతంలో ఇండియన్ క్రికెటర్ అజింక్య రహానే పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. భారత్‌తో గౌహతిలో జరుగుతున్న రెండో టెస్టులో దక్షిణాఫ్రికా ఫీల్డర్ మార్క్రమ్ ఇప్పటి వరకు 9 క్యాచ్‌లు అందుకున్నాడు. అయితే గతంలో ఓ టెస్టు మ్యాచ్‌లో 8 క్యాచ్‌లు అందుకున్న రికార్డు రహానే పేరిట ఉన్నది. 2015లో శ్రీలంకతో గాలేలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో రహానే 8 క్యాచ్‌లు పట్టాడు. ఇప్పుడు ఆ రికార్డును గౌహతి టెస్టులో మార్క్రమ్ బ్రేక్ చేశాడు.
ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఫీల్డర్లలో గ్రెగ్ చాపల్ మూడవ స్థానంలో ఉన్నాడు. 1974లో ఇంగ్లండ్‌తో పెర్త్‌లో జరిగిన మ్యాచ్‌లో గ్రెగ్ చాపల్ 7 క్యాచ్‌లు పట్టాడు. 1977లో ఇంగ్లండ్‌తో బెంగుళూరులో జరిగిన మ్యాచ్‌లో యజువింద్ర సింగ్ 7 క్యాచ్‌లు అందుకున్నాడు. ఏడేసి క్యాచ్‌లు అందుకున్న క్రికెటర్లలో హసన్ తిలకరత్న, స్టీఫెన్ ఫ్లెమింగ్, మాథ్యూ హేడెన్, కేఎల్ రాహుల్ ఉన్నారు.