Manu Bhaker | ఢిల్లీ: ఇటీవలే ముగిసిన పారిస్ ఒలింపిక్స్‌లో భాగంగా షూటింగ్లో రెండు కాంస్య పతకాలు సాధించిన యువ షూటర్ మను భాకర్ సోషల్ మీడియాలో తనపై వస్తున్న ట్రోలింగ్‌కు ఘాటుగా స్పందించింది. స్వతంత్ర భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించిన మను.. ఏదైనా కార్యక్రమాలకు వెళ్లినప్పుడు తనకు వచ్చిన రెండు పతకాలను చూపించడంపై సోషల్ మీడియాలో పలువురు దీనిని తప్పుబడుతున్నారు.
దీనిపై మను ఓ జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ.. ‘నేను తీసుకెళ్తా! ఎందుకు తీసుకెళ్లకూడదు? ఆ పతకాలను చూడాలని అందరికీ ఆసక్తిగా ఉంటుంది. నన్ను కార్యక్రమాలకు ఆహ్వానించే నిర్వాహకులు సైతం వాటిని తీసుకురావాలని అడుగుతున్నారు. నేను వాటిని తీసుకెళ్లినప్పుడు అక్కడ వాళ్లు ఫొటోలు తీసుకుని తమ సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు’ అని తెలిపింది. ఇదే విషయమై ఆమె ఎక్స్‌లో స్పందిస్తూ.. ‘నేను సాధించిన ఈ పతకాలు దేశానికి చెందినవి. వీటిని ధరిస్తున్నందుకు నేను గర్విస్తున్నా’ అని రాసుకొచ్చింది.