ఢిల్లీ : గత కొంతకాలంగా వివాదాస్పదమైన ‘మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ అవార్డులను కేంద్ర ప్రభుత్వం గురువారం ప్రకటించింది. పారిస్ ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించి చరిత్ర సృష్టించిన మనూ భాకర్‌తో పాటు చదరంగంలో యువ సంచలనం దొమ్మరాజు గుకేశ్, పారా హైజంపర్ ప్రవీణ్‌కుమార్, హాకీ సారథి హర్మన్‌ప్రీత్ సింగ్‌ను ఖేల్ రత్న అవార్డుకు ఎంపికచేసింది. వీరితో పాటు 32 మందికి అర్జున అవార్డులు ప్రకటించింది. తెలంగాణ అమ్మాయి, గతేడాది ముగిసిన పారిస్ పారాలింపిక్స్‌లో కాంస్యం సాధించిన దీప్తి జివాంజీకి అర్జున దక్కింది. మరో తెలుగమ్మాయి జ్యోతి యర్రాజీ (ట్రాక్ అండ్ అథ్లెటిక్స్) సైతం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. అర్జున అవార్డు సాధించినవారిలో ఏకంగా 17 మంది పారా క్రీడాకారులే ఉన్నారు.
పారిస్ ఒలింపిక్స్‌తో పాటు పారాలింపిక్స్‌లో పతకాలు సాధించినవారికి అవార్డులు వరించాయి. క్రీడాకారులతో పాటు ఐదుగురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు దక్కాయి. ఈనెల 17న రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చేతులమీదుగా అవార్డు గ్రహీతలు పురస్కారాలు అందుకోనున్నారు. అర్జున అవార్డు సాధించినవారిలో దీప్తి, జ్యోతితో పాటు బాక్సర్లు నీతూ, స్వీటి, హాకీ క్రీడాకారులు అభిషేక్, జర్మన్‌ప్రీత్, సుఖ్జీత్ సింగ్ ఉన్నారు. ఒలింపిక్స్‌లో కాంస్యాలతో మెరిసిన సరబ్‌జ్యోత్ (షూటింగ్), రెజ్లర్ అమన్ సెహ్రావత్నూ అర్జున వరించింది. పారాలింపిక్స్‌లో సత్తా చాటిన మురుగేశన్, నిత్యశ్రీ, రామదాస్, కపిల్ పర్మర్, సచిన్ ఖిలారి వంటి వాళ్లూ అవార్డులలో చోటు దక్కించుకున్నారు. ద్రోణాచార్య ఆవార్డు సాధించిన వారిలో సుభాష్ రాణా (పారా షూటింగ్), దీపాలి దేశ్‌పాండే (షూటింగ్), సందీప్ సంగ్వాన్ (హాకీ) ఉన్నారు. ఎస్. మురళీధరన్ (బ్యాడ్మింటన్), అర్మండొ ఆగ్నెలో కొలాకో (ఫుట్‌బాల్)కు ద్రోణా చార్య లైఫ్‌టైమ్ అవార్దు దక్కింది.
ఖేల్ రత్న రూ.25 లక్షలు
అర్జున రూ.15 లక్షలు
పర్వతగిరి, జనవరి2: చిరుత వేగం దీప్తికి వెన్నతో పెట్టిన విద్య. బరిలోకి దిగితే ఆమెకు ఆమె సాటి. పేద కుటుంబంలో పుట్టినా చిన్నప్పటి నుంచే పరుగుపందెంలో తన ప్రతిభతో అందరి ప్రశంసలు అందుకుంది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడ గ్రామానికి చెందిన దీప్తి.. స్థానికంగా ఉన్న ఆర్డీఎఫ్ పాఠశాలలో విద్యాబ్యాసం పూర్తిచేసింది. చదువుకునే రోజుల్లో ఇంటి నుంచి పాఠశాలకు.. పాఠశాల నుంచి ఇంటికి నడవడం కన్నా పరుగెత్తుతూనే వెళ్లేది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన ఆర్డీఎప్ వ్యవస్థాపకుడు ఎర్రబెల్లి రామ్మోహన్రావు దీప్తిని క్రీడల వైపునకు మళ్లించారు. ఆమెకు ప్రత్యేక తర్ఫీదునిచ్చి ప్రోత్సహించారు. దీప్తిలోని వేగాన్ని గుర్తించిన సాయ్ అకాడమీ కోచ్ నాగపురి రమేశ్ వద్దకు చేరాక ఆమె మరింత రాటుదేలింది. 2022 సెప్టెంబర్‌లో వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్లో స్వర్ణం సాధించిన ఆమె ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. పారాలింపిక్స్‌లో కాంస్యం తో పాటు తాజాగా అర్జున అవార్డు రావడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. దీప్తి నేటి యువతకు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
ఖేల్ రత్న, అర్జున అవార్డు గ్రహీతలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ ద్వారా అభినందనలు తెలిపారు. ఆయన స్పందిస్తూ.. ‘విశ్వ వేదికపై భారత కీర్తిపతకాన్ని ఎగరేసి.. వంద కోట్ల ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి ఖేల్ రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన క్రీడాకారులకు అభినందనలు. తెలంగాణ బిడ్డ పారా అథ్లెట్ దీప్తి జివాంజీ, ఏపీ అథ్లెట్ జ్యోతి.. అర్జున అవార్డులకు ఎంపికై తెలుగు రాష్ర్టాల ఖ్యాతిని దేశం దశదిశలా వ్యాపింపజేసినందుకు శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.
ప్రతిష్టాత్మక అర్జున అవార్డుకు ఎంపికైన తెలంగాణకు చెందిన దీప్తి జివాంజీకి శుభాకాంక్షలు. పారిస్ పారాలింపిక్స్‌లో భాగంగా 400 మీటర్ల టీ20 రేసులో పతకం సాధించిన ఆమె తెలంగాణతో పాటు దేశానికి గర్వకారణంగా నిలిచింది. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటున్నా.