Manpreet Singh : భారత హాకీ జట్టు (Indian Hockey Team) స్టార్ ఆటగాడు మన్‌ప్రీత్ సింగ్ (Mann Preet Singh) చరిత్ర సృష్టించాడు. దేశం తరఫున అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. నెదర్లాండ్స్‌లోని రోటర్‌డామ్‌లో జర్మనీతో జరిగిన ఎఫ్ఐహెచ్ హాకీ ప్రో లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగడం ద్వారా మన్‌ప్రీత్ తన 413వ మ్యాచ్ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో హాకీ ఇండియా ప్రస్తుత అధ్యక్షుడు దిలీప్ టిర్కీ (Dilip Tirky) పేరిట ఉన్న 412 మ్యాచ్‌ల రికార్డును మన్‌ప్రీత్ అధిగమించాడు.
ఈ చారిత్రక ఘనతను గుర్తిస్తూ హాకీ ఇండియా.. మన్‌ప్రీత్ సింగ్‌ను అభినందించి, రూ.10 లక్షల నగదు బహుమతిని ప్రకటించింది. పదిహేనేళ్లుగా భారత హాకీ జట్టుకు మన్‌ప్రీత్ గుండెకాయలా నిలుస్తున్నాడని, ఆయన నిలకడ అసాధారణమని కొనియాడింది. 2011లో 19 ఏళ్ల వయసులో భారత జట్టులోకి అడుగుపెట్టిన మన్‌ప్రీత్, టోక్యో, పారిస్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాలు సాధించిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ప్రపంచంలోనే అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్ల జాబితాలో మన్‌ప్రీత్ ఐదో స్థానంలో నిలువడం విశేషం.
ఈ మైలురాయిపై మన్‌ప్రీత్ సింగ్ స్పందిస్తూ.. ‘భారత్ తరఫున ఇన్ని మ్యాచ్‌లు ఆడటం గర్వంగా ఉంది. ఈ విజయాన్ని నా సహచరులకు, కుటుంబసభ్యులకు అంకితం చేస్తున్నా’ అన్నాడు. ఒలింపిక్ స్వర్ణం, ప్రపంచ కప్ గెలువాలనేదే తన లక్ష్యమని ఆయన స్పష్టంచేశాడు. హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ మాట్లాడుతూ.. ‘మన్‌ప్రీత్ అంకితభావం, నిలకడకు ఈ రికార్డు నిదర్శనం. భవిష్యత్ తరాలకు ఆయన స్ఫూర్తి’ అని ప్రశంసించారు. హాకీ ఇండియా సెక్రెరటరీ జనరల్ భోలా నాథ్ సింగ్ కూడా మన్‌ప్రీత్‌ను ప్రశంసించారు.