Manoj Tiwary : పశ్చిమ బెంగాల్ క్రీడా శాఖ మంత్రి మనోజ్ తివారీ(Manoj Tiwary) ఫస్ట్ క్లాస్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్(Eden Gardens)లో విజయంతో కెరీర్‌ను ముగించాడు. బిహార్‌తో మ్యాచ్ అనంతరం బెంగాల్ క్రికెట్ అసోసియేషన్(CAB) తివారీని ఘనంగా సన్మానించింది. సుదీర్ఘ కెరీర్లో బెంగాల్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించిన అతడిని అసోసియేషన్ గోల్డెన్ బ్యాటు (Golden Bat)తో సత్కరించింది. క్యాబ్ ప్రస్తుత అధ్యక్షుడు స్నేహశిష్ గంగూలీ, మాజీ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ.. తివారీకి గోల్డెన్ బ్యాట్ అందించారు.
ఈ సందర్భంగా తివారీ మాట్లాడుతూ.. ఈ రోజు మాన్నను మిస్ అవుతున్నా. ఆయన 2017లో చనిపోయారు. ఆ తర్వాత అమ్మ, నా భార్య నా వెన్నంటి నిలిచారు అని భావోద్వేగానికి లోనయ్యాడు. అంతేకాదు కెరీర్ తొలినాళ్లలో గంగూలీని చూసి స్ఫూర్తి పొందానని తివారీ చెప్పాడు. నేను తొలిసారి ఈడెన్ గార్డెన్స్‌కు వచ్చినప్పుడు గంగూలీ బ్యాటింగ్ చేస్తూ కనిపించాడు. అప్పుడే అతడు కోల్‌కతా ప్రిన్స్ అవుతాడని అనిపించింది. నేను కూడా అతడిలా ఆడాలని డిసైడ్ అయ్యాను అని మనోజ్ తివారీ వెల్లడించాడు.
తివారీ 2006లో రంజీల్లో అరంగేట్రం చేశాడు. నిలకడగా రాణించిన అతడు 2008లో టీమిండియా జెర్సీవేసుకున్నాడు. అయితే.. జట్టులో గట్టి పోటీ ఉండడంతో అతడికి కేవలం 12 వన్డేలు, 3 టీ20లు ఆడే అవకాశం వచ్చింది. భారత జట్టు తరఫున 2015లో జింబాబ్వేపై చివరి మ్యాచ్ ఆడేసిన తివారీ ఆ తర్వాత రంజీలపై దృష్టి పెట్టాడు. కెరీర్లో ఆఖరి రంజీ మ్యాచ్‌లో తివారీ నిరాశపరిచాడు. 30 పరుగులు చేశాడంతే. అయితే.. బౌలర్లు విజృంభించడంతో బెంగాల్ జట్టు ఇన్నింగ్స్ 204 పరుగుల తేడాతో బిహార్‌పై గెలుపొందింది.
కుడి చేతివాటం బ్యాటర్ అయిన తివారీ 141 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు ఆడాడు. 30 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీలు బాదాడు. అంతేకాదు ఐపీఎల్‌లోనూ తన మార్క్ ఇన్నింగ్స్‌లతో మెరిశాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్(Delhi Daredevils), కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders), కింగ్స్ ఎలెవన్ పంజాబ్(Kings XI Punjab), రైసింగ్ పూణే సూపర్ జెయింట్స్(Rising Pune Supergiants) ఫ్రాంచైజీలకు తివారీ ప్రాతినిధ్యం వహించాడు.