నెక్కొండ, సెప్టెంబర్ 11: శ్రీలంక రత్నపురలోని ఇండోర్ స్టేడియంలో డిసెంబర్ 8 నుంచి 10 వరకు జరిగే తొలి దక్షిణాసియా పారా త్రోబాల్ టోర్నీకి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం చంద్రుగొండ గ్రామానికి చెందిన మాంకాల రాజశేఖర్ ఎంపికయ్యాడు. ఇటీవల తమిళనాడులో నిర్వహించిన జాతీయ పారా త్రోబాల్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచి బెస్ట్ ప్లేయర్‌గా ఎన్నికయ్యాడు. నిరుపేద కుటుంబానికి చెందిన రాజశేఖర్‌కు శ్రీలంకలో జరుగనున్న పారా త్రోబాల్ టోర్నీలో పోటీపడేందుకు జాతీయ పారా త్రోబాల్ సమాఖ్య వద్ద ఎలాంటి గ్రాంట్లు లేనందున ఆర్థిక మద్దతు అందించలేమని ప్రకటించింది.
విమానం, వీసా, హోటల్ వసతి, ఎనిమిది రోజుల ఆహారం, రవాణా, ప్రవేశ రుసుము, రిజిస్ట్రేషన్, కోచింగ్ క్యాంపు తదితర అవసరాల కోసం ఈనెల 28లోగా రూ.1,09,000 చెల్లించాలని పారా త్రోబాల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. నిర్దేశిత గడువులో డబ్బులు కట్టకపోతే రిజర్వ్ ప్లేయర్లను ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. పేద కుటుంబానికి చెందిన రాజశేఖర్ జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచినా అంతర్జాతీయస్థాయి పోటీలకు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఆర్థిక సాయం అందించే దాతలు 96521 78012 సెల్ నంబర్‌కు ఫోన్ పే, గూగుల్ పే ద్వారా అందించాలని కోరాడు.