బాంకాక్ : ఆసియన్ కప్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా కాంస్య పతకం నెగ్గింది. 39 ఏండ్ల టోర్నీ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి భారత టీటీ ప్లేయర్‌గా మనిక రికార్డులకెక్కింది. శనివారం జరిగిన కాంస్య పతక పోరులో మనిక 4-2(11-6, 6-11, 11-7, 12-10, 4-11, 11-2)తో ప్రపంచ ఆరో ర్యాంకర్ హినా హయత(జపాన్)ను చిత్తు చేసింది.
ఈ విజయంతో 44వ ర్యాంకర్ మనికకు 10వేల అమెరికన్ డాలర్లు ప్రైజ్ మనీగా దక్కాయి. మనిక వరుసగా మూడోసారి తనకంటే ఎంతో మెరుగైన ర్యాంకింగ్ ప్లేయర్లపై విజయం సాధించింది. కాగా అంతకుముందు జరిగిన సెమీస్‌లో మనిక 2-4(8-11, 11-7, 7-11, 6-11, 11-8, 7-11)తో జపాన్‌కు చెందిన మిమా ఇతో చేతిలో ఓడిపోయింది.