ఇండోర్: జాతీయ సీనియర్ టేబుల్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో మానవ్ థక్కర్, యశస్విని గోర్పడె విజేతలుగా నిలిచారు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో పెట్రోలియం స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు(పీఎస్‌పీబీ) ప్యాడ్లర్ మానవ్ థక్కర్ 11-2, 11-4, 6-11, 11-9, 11-3తో జీత్ చంద్రా(రైల్వేస్ స్పోర్ట్స్ ప్రమోషన్ బోర్డు)పై అద్భుత విజయం సాధించాడు. పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో మానవ్ ప్రత్యర్థిని వరుస గేముల్లో చిత్తుచేశాడు. తొలి గేమ్‌ను 11-2తో కైవసం చేసుకున్న మానవ్ మ్యాచ్ ఆసాంతం అదే దూకుడు కొనసాగించాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ తుది పోరులో యశస్విని 11-6, 12-14, 11-5, 9-11, 13-11, 6-11, 11-8తో సిండ్రెల్లా దాస్(పీఎస్‌పీబీ)పై విజయం సాధించింది. తొలి గేమును 11-6తో దక్కించుకున్న యశస్వినికి మ్యాచ్ సాగుతున్న కొద్ది సిండ్రెలా దీటైన పోటీనిచ్చింది. ఓవరాల్‌గా జాతీయ టీటీ చాంపియన్‌షిప్‌లో తొలిసారి మానవ్, యశస్విని టైటిల్ విజేతలుగా నిలిచారు.