ప్రపంచ క్రికెట్ గురించి మాట్లాడేప్పుడు మర్చిపోలేని పేర్లలో వసీం అక్రమ్ ఒకటి. అలాగే శ్రీలంక దిగ్గజం మహేల జయవర్దనే పేరు కూడా వదలకూడదు. 1997లో శ్రీలంక తరఫున అరంగేట్రం చేసి ఈ మాజీ కెప్టెన్.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న అత్యంత కష్టమైన బౌలర్ ఎవరు? అని అడగ్గా మరో ఆలోచన లేకుండా వసీం అక్రమ్ పేరు చెప్పేశాడీ లెజెండరీ బ్యాటర్.
‘‘ఈ విషయంలో ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు.. ఫార్మాట్ ఏదైనా సరే వసీం అక్రమ్‌ను ఎదుర్కోవడం చాలా కష్టం. అతని కెరీర్ రెండో సగంలో, అది కూడా మంచి పీక్ ఫామ్‌లో తను ఉండగా నేను అరంగేట్రం చేశా. అప్పట్లో నాకు అక్రమ్ బౌలింగ్ ఎదుర్కోవడం చాలా కష్టంగా.. ఒక పీడ కలలా ఉండేది’’ అని తన అనుభవాలను పంచుకున్నాడు.
‘‘అక్రమ్ కొత్త బంతితో వస్తే సవాలుగా ఉండేది. పాత బంతితో బౌలింగ్ చేస్తున్నా పెద్ద మార్పేమీ ఉండదు. రెండో రోజు సాయంత్రం నాలుగు గంటల సమయంలో కూడా చేతిలోని బ్యాటును బీట్ చేసేవాడు’’ అని అక్రమ్ గురించి చెప్పాడు. అక్రమ్ చేతి యాక్షన్ చాలా వేగంగా ఉండేదని, అలాగే అతని రిథమ్‌కు అలవాటు పడటం కష్టంగా ఉండేదని జయవర్దనే వెల్లడించాడు.
‘‘దానికితోడు రౌండ్ ది వికెట్, ఓవర్ ది వికెట్.. ఇలా రెండు వైపుల నుంచి బౌలింగ్ చేస్తూ యాంగిల్స్ క్రియేట్ చేసేవాడు. కొత్త బంతి అయినా, పాత బంతి అయినా.. ఏదైనా సరే తనకు నచ్చినట్లు స్వింగ్ చేసేవాడు’’ అంటూ అక్రమ్ బౌలింగ్ ఎంత కష్టంగా ఉండేదో విశ్లేషించాడు. పాకిస్తాన్ తరఫున అద్భుతమైన రికార్డులు సృష్టించిన అక్రమ్.. ప్రపంచ అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా కీర్తించబడిన సంగతి తెలిసిందే.