ముంబై, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఇటీవలే జార్జియాలో ముగిసిన ఫిడే మహిళల చెస్ ప్రపంచకప్ ఫైనల్లో కోనేరు హంపిని ఓడించిన యువ సంచలనం దివ్య దేశ్‌ముఖ్‌ను మహారాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. దివ్యకు రూ. 3 కోట్ల నగదు బహుమానాన్ని అందించింది. ఈ మేరకు నాగ్‌పూర్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, క్రీడా శాఖ మంత్రి మానిక్‌రావు తదితరులు హాజరై దివ్యను సత్కరించారు.
అమ్మాయిలకు వరుసగా రెండో టైటిల్
ఏథెన్స్: అండర్-17 వరల్డ్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత అమ్మాయిలు వరుసగా రెండో ఏడాదీ టీమ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. శుక్రవారం రాత్రి జరిగిన మహిళల 61 కిలోల కేటగిరీలో యువ రెజ్లర్ యశిత.. ఫైనల్లో ఓడినప్పటికీ రజతం సొంతం చేసుకుంది. దీంతో ఈ టోర్నీలో మహిళా రెజ్లర్లు రెండు స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో టీమ్ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. మరోవైపు పురుషుల 110 కిలోల విభాగం సెమీస్ పోరులో భారత రెజ్లర్ లాకీ.. 8-0తో జార్జియాకు చెందిన ముర్తాజ్ను ఓడించి ఫైనల్ చేరాడు.