స్టావెంజర్(నార్వే): ప్రతిష్టాత్మక నార్వే చెస్ చాంపియన్‌షిప్‌లో స్టార్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ మరోమారు విజేతగా నిలిచాడు. తనకు అచ్చొచ్చిన నార్వే చెస్ టోర్నీలో ఏకంగా ఏడోసారి టైటిల్‌ను ఖాతాలో వేసుకున్నాడు. శనివారంతో ముగిసిన టోర్నీలో కార్ల్సన్ 16 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచి క్లాసిక్ విభాగంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు.
టోర్నీలో వరుస విజయాలతో టైటిల్‌పై ఆశలు రేపిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్ ఆఖరి రౌండ్లో ఘోరంగా తడబడ్డాడు. అమెరికా జీఎం ఫాబియానో కరువన(15.5)తో జరిగిన చివరి రౌండ్ గేములో ఓటమి ఎదుర్కొన్న గుకేశ్ 14.5 పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యాడు.
ఫాబియానోతో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన పోరులో కీలక సమయంలో చేసిన తప్పిదం వల్ల గుకేశ్ టైటిల్ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. మరోవైపు మహిళల విభాగంలో ఉక్రెయిన్‌కు చెందిన అన్నా ముజుచుక్(16.5) టైటిల్ విజేతగా నిలిచింది.