లక్నో: హ్యాట్రిక్ విజయాలతో అనూహ్యంగా ప్లేఆఫ్స్ రేసులోకి వచ్చిన చెన్నై సూపర్ కింగ్స్‌కు లక్నో సూపర్‌జెయింట్స్ షాకిచ్చింది. ఇప్పటికే ప్లేఆఫ్స్ నుంచి వైదొలిగిన ఆ జట్టు.. శుక్రవారం లక్నోలో పూర్తి ఏకపక్షంగా సాగిన పోరులో సీఎస్కేను 7 వికెట్ల తేడాతో ఓడించడమే గాక పోతూపోతూ చెన్నై ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసింది. మిచెల్ మార్ష్ (38 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్స్‌లతో 90) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో ప్రత్యర్థి నిర్దేశించిన 188 పరుగుల ఛేదనను ఆ జట్టు 16.4 ఓవర్లలో 3 వికెట్లే కోల్పోయి ఊదేసింది. మొదట కార్తీక్ శర్మ (42 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 71) మెరుపులకు తోడు ఆఖర్లో శివమ్ దూబె (16 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 32 నాటౌట్) రాణించడంతో చెన్నై 187/5 స్కోరు చేసింది. ఆకాశ్ సింగ్ (3/26) చెన్నైని కట్టడిచేశాడు.
లక్ష్యం మరీ సులువైనదేమీ కాకపోయినా మార్ష్ దంచుడుతో లక్నోకు ఛేదన నల్లేరుపై నడకే అయింది. దొరికిన బంతిని దొరికినట్టుగా బాదిన ఈ ఆసీస్ హార్డ్ హిట్టర్.. ఇంగ్లిస్ (36) అండగా చెన్నై బౌలర్లపై నిర్ధాక్షిణ్యంగా విరుచుకుపడ్డాడు. ఫస్ట్ ఓవర్లో రెండు బౌండరీలతో పరుగుల వేటకు శ్రీకారం చుట్టిన అతడి జోరు.. ఇన్నింగ్స్ ఆసాంతం ఎక్కడా తగ్గలేదు. అన్షుల్ వేసిన ఐదో ఓవర్లో అయితే విధ్వంసాన్ని తారాస్థాయికి చేర్చుతూ వరుసగా నాలుగు సిక్స్‌లు, ఓ బౌండరీతో 28 రన్స్ పిండుకున్నాడు. ఆ తర్వాత బాధితుడు స్పెన్సర్ జాన్సన్. ఆరో ఓవర్లో రెండు బౌండరీలు, సిక్స్‌తో అతడిని శిక్షించడంతో పవర్ ప్లేలోనే జెయింట్స్ వికెట్లేమీ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. 21 బంతుల్లోనే ఫిఫ్టీ మార్కును అందుకున్న మార్ష్.. అదే దూకుడును కొనసాగించడంతో ఇన్నింగ్స్ అర్ధ భాగానికే లక్నో 124/0తో తిరుగులేని స్థితిలో నిలిచింది. కానీ ముకేశ్ 12వ ఓవర్లో ఇంగ్లిస్‌తో పాటు మార్ష్‌నూ ఔట్ చేయడంతో చెన్నై ఊపిరి పీల్చుకుంది. బౌండరీతో 90లలోకి వచ్చిన మార్ష్.. దురదృష్టవశాత్తూ రనౌట్‌గా వెనుదిరిగి సెంచరీని కోల్పోయాడు. ఓపెనర్ల నిష్క్రమణ అనంతరం లక్నో స్కోరు వేగం తగ్గినా నికోలస్ పూరన్ (26 నాటౌట్) అన్షుల్ 17వ ఓవర్లో నాలుగు సిక్సర్లతో లాంఛనాన్ని పూర్తిచేశాడు.
ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడిన ఆకాశ్ వరుస ఓవర్లలో విజృంభించి సీఎస్కే టాపార్డర్‌ను దెబ్బతీయడంతో పవర్‌ప్లేలోనే ఆ జట్టు తడబాటుకు గురైంది. తొలి ఓవర్లోనే మూడు బౌండరీలు కొట్టి ఊపుమీద కనిపించిన శాంసన్ (20)తో పాటు కెప్టెన్ రుతురాజ్ (13) ఆకాశ్ ఉచ్చులో చిక్కుకోవడంతో ఆరు ఓవర్లకు సీఎస్కే స్కోరు 37/2 మాత్రమే. గత మ్యాచ్‌లో మెరుపు ఆటతో రెచ్చిపోయిన ఉర్విల్ (7) కూడా ఆకాశ్ 8వ ఓవర్లో మార్ష్ చేతికి చిక్కడంతో చెన్నై మూడో వికెట్ కోల్పోయింది. ఈ దశలో బ్రెవిస్ (25)తో కలిసి కార్తీక్ జట్టును ఆదుకున్నాడు. ఆరంభంలో పరిస్థితులకు తగ్గట్టుగా ఆచితూచి ఆడిన ఈ కుర్రాడు.. కుదురుకున్నాక బ్యాట్ ఝుళిపించడంతో సీఎస్కే స్కోరువేగం పెరిగింది. 10 ఓవర్లు ముగిసేసరికి 71/3తో ఉన్న ఆ జట్టు.. ఆ తర్వాత 6 ఓవర్లలో 71 రన్స్ రాబట్టింది. ప్రిన్స్ 13వ ఓవర్లో రెండు సిక్స్‌లతో జోరుపెంచిన కార్తీక్.. షమీ విసిరిన 15వ ఓవర్లో కవర్స్ మీదుగా సిక్స్ కొట్టి ఈ సీజన్లో రెండో అర్ధశతకాన్ని నమోదుచేశాడు. కానీ అదే ఓవర్లో షమీ.. బ్రెవిస్‌ను ఔట్ చేయడంతో 70 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. షాబాజ్ వేసిన 16వ ఓవర్లో 6, 4, 4 బాదిన కార్తీక్.. ఆఖరి బంతికి మార్క్మ్క్రు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో లక్నో పేసర్లు కట్టడిచేయడంతో చెన్నై 160 పరుగుల మార్కునైనా దాటుతుందా? అనిపించింది. కానీ ప్రిన్స్ ఆఖరి ఓవర్లో దూబె.. 6, 4, 4, 6తో రెచ్చిపోయి తన జట్టుకు అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు.
చెన్నై: 20 ఓవర్లకు 187/5 (కార్తీక్ 71, దూబె 32*, ఆకాశ్ 3/26, షమీ 1/41);
లక్నో: 16.4 ఓవర్లకు 188/3 (మార్ష్ 90, ఇంగ్లిస్ 36, ముకేశ్ 1/24, జాన్సన్ 1/39)