తొలి బంతికే కెప్టెన్ రాహుల్ (0) గోల్డెన్ డక్. ఆ తర్వాత కాసేపటికే వెటరన్ క్వింటన్ డీ కాక్ (7) కూడా పెవిలియన్ చేరాడు. విండీస్ పవర్ హిట్టర్ ఎవిన్ లూయిస్ (10), నిలకడగా ఆడే మనీష్ పాండే (6) అందరూ కనీసం పోరాటం చేయకుండానే క్రీజును వీడారు. దీంతో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్లో అత్యంత చెత్త ప్రదర్శన చూపిస్తుందని అంతా అనుకున్నారు.
కానీ వారి భయాలను తొలగించి నేనున్నానంటూ ధైర్యం పంచాడు దీపక్ హుడా (51 నాటౌట్). ప్రధాన బ్యాటర్లంతా చేతులెత్తేసిన వేళ మొక్కవోని పట్టుదలతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో జట్టును కూడా పోరాడగలిగే స్కోరు వైపు తీసుకెళ్తున్నాడు.
మహమ్మద్ షమీ, వరుణ్ ఆరోన్ ధాటిని 29 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును ఆదుకున్నాడు. అతని పోరాటంతో లక్నో జట్టు 14 ఓవర్లు ముగిసే సరికి 90 పరుగులతో మంచి స్కోరు చేసేలా కనిపిస్తోంది.