కొచ్చి: భారత ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త! తాము ఎంతగానో ఆరాధించే ఆధునిక ఫుట్‌బాల్ దిగ్గజం, సాకర్ స్టార్ లియోనల్ మెస్సీ నేతృత్వంలోని అర్జెంటీనా..భారత్‌లో మ్యాచ్ ఆడబోతున్నది. ఈ ఏడాది నవంబర్‌లో కేరళలో జరిగే ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లో అర్జెంటీనా టీమ్ బరిలోకి దిగుతున్నది. కొచ్చి లేదా తిరువనంతపురం వేదికగా నవంబర్ 10 నుంచి 18వ తేదీ మధ్యలో జరిగే మ్యాచ్‌లో స్థానిక ఫుట్‌బాల్ టీమ్‌తో అర్జెంటీనా ఆడనుంది.
ఈ విషయాన్ని కేరళ క్రీడాశాఖ మంత్రి అబ్దుర్రెహమన్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నాడు. ‘లియోనల్ స్కాలోని కెప్టెన్సీలోని అర్జెంటీనా టీమ్ ఈ ఏడాది రెండు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌లు ఆడనుంది. అక్టోబర్‌లో అమెరికాలో జరిగే మ్యాచ్‌లో పాటు నవంబర్‌లో భారత్‌లో మరో మ్యాచ్ ఆడుతుంది’ అని అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్ తమ అధికారిక ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
2022లో జరిగిన ఫిఫా ప్రపంచకప్ టోర్నీలో అర్జెంటీనా విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. ఫైనల్లో మెస్సీసేన..ఫ్రాన్స్‌పై చిరస్మరణీయ విజయం సాధించింది.