Lionel Messi | ప్రముఖ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటినా ఆటగాడు లియోనెల్ మెస్సీ త్వరలో భారత్‌లోకి రానున్నాడు. ఈ పర్యటనలో ఫుల్బాల్ మ్యాచ్ కాకుండా బ్యాట్‌పట్టి బరిలోకి దిగబోతున్నాడు. టీమిండియా దిగ్గజ ప్లేయర్ సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, స్టార్ ప్లేయర్ విరాట్‌తో కలిసి మ్యాచ్ ఆడనున్నాడు. డిసెంబర్ 14న ముంబయిలోని వాంఖడేలో సెవెన్-ఎ-సైడ్ క్రికెట్ గేమ్‌లో పాల్గొనున్నట్లు తెలుస్తున్నది. మెస్సీ డిసెంబర్ 13 నుంచి 15 ముంబయి, ఢిల్లీ, కోల్‌కతాలో అభిమానులను కలిసేందుకు ఈ ప్రమోషనల్ టూర్ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ పర్యటనలో సాకర్ స్టార్ క్రికెట్ మ్యాచ్‌లో ఆడనున్నట్లు సమాచారం. మెస్సీ భారత్‌కు వస్తే ఇది రెండోసారి.
ఇంతకు ముందు 2011లో తొలిసారిగా పర్యటించనున్నాడు. కోల్‌కతా సాల్ట్ లేక్ స్టేడియంలో వెనిజులాతో ఇంటర్నేషనల్ ఫ్రెండ్లీ మ్యాచ్‌లో పాల్గొన్నాడు. డిసెంబర్ 14న మెస్సీ వాంఖడేలో జరిగి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని.. ముంబయిలోని వాంఖడే స్టేడియంలో సచిన్, ధోనీ, రోహిత్, విరాట్ తదితర క్రికెటర్ ప్లేయర్లతో కలిసి మ్యాచ్ ఆడే అవకాశం ఉందని ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) వర్గాలు వెల్లడించాయి. ఈవెంట్ కోసం గ్రౌండ్‌ను బుక్ చేసేందుకు ఒక ఏజెన్సీ ఇప్పటికే ఎంసీఏను సంప్రదించిందని.. షెడ్యూల్ ఖరారైతే త్వరలో అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. కోల్‌కతాలో చిన్నారుల కోసం మెస్సీ ఫుట్‌బాల్ వర్క్‌షాప్‌ను నిర్వహించనున్నాడు. ఈడెన్ గార్డెన్స్‌లో మెస్సీ గౌరవార్థం ‘GOAT CUP’ మ్యాచ్‌కు ఏర్పాట్లు చేయబోతున్నట్లు తెలుస్తున్నది. ఇదిలా ఉండగా.. కేరళలో అక్టోబర్, నవంబర్‌లో అర్జెంటీనా జట్టు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడనున్నది. ఈ మేరకు అర్జెంటీనా ఫుట్‌బాల్ అసోసియేషన్‌తో కేరళ ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఈ మ్యాచ్ ప్రణాళికలను నిలిపివేసినట్లు సమాచారం.