Ziva Dhoni | టీమిండియా జట్టు మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ కుమార్తె జీవా ధోనీకి లియోనెల్ మెస్సి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. మెస్సి సంతకం చేసిన అర్జెంటీనా జెర్సీని బహుమతిగా అందించారు. ఖతార్‌లోని లుసైల్ స్టేడియంలో ఇటీవల జరిగిన ఫైనల్లో అర్జెంటీనా ఫ్రాన్స్‌ను ఓడించడంతో ఫిఫా ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. విజయం అనంతరం మెస్సి.. జీవా ధోనీకి ‘జీవా కోసం’ అనే సందేశంతో సంతకం చేసిన షర్ట్‌ను పంపారు.
మెస్సి పంపిన జెర్సీని ధరించిన జీవా తెగ సంబరపడిపోతోంది. ఆ షర్ట్‌ను ధరించి ఫొటోలకు ఫోజులిస్తూ మురిసిపోయింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ధోనీ సతీమణి సాక్షి ధోనీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. ‘లైక్ ఫాదర్, లైక్ డాటర్’ అంటూ సరదాగా క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.