Liam Livingstone : ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్(Liam Livingstone) ఎంతటి విధ్వంసకారుడో తెలిసిందే. టీ20 స్పెషలిస్ట్ అయిన అతడు అలవోకగా సిక్సర్లు బాదడంలో దిట్ట. పొట్టి ప్రపంచకప్ విజేత కూడా అయిన లివింగ్‌స్టోన్ ఈ మధ్య వన్డేల్లో పెద్దగా ఆడడం లేదు. భారీకాయంతో భారీ షాట్లతో బౌలర్లను భయపెట్టే అతడు పేలవ ఫామ్‌తో జట్టుకు భారంగా మారుతున్నాడు. దాంతో, అతడిపై అందరూ ఊహించినట్టే ఇంగ్లండ్ సెలెక్టర్లు వేటు వేశారు.
స్వదేశంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే సిరీస్‌కు అతడిని పక్కనపెట్టేశారు. ఈ నేపథ్యంలో ఈ స్టార్ ఆటగాడు తన వన్డే కెరీర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘జట్టులో చోటు కోల్పోయినంత మాత్రాన ఏడుస్తూ కూర్చోన’ని లివింగ్‌స్టోన్ అన్నాడు.
‘బహుశా వన్డేల్లో నా పని అయిపోయిందనుకుంటున్నా. వరల్డ్ కప్ మినహాయిస్తే.. నేను పెద్దగా 50 ఓవర్ల ఫార్మాట్లో ఆడింది లేదు. అలాగని ఏమాత్రం బాధ పడను. ఎందుకంటే.. నాకు ఇంకా 31 ఏండ్లే. జట్టులో చోటు దక్కనంత మాత్రాన ఓ చోట కూర్చొని ఏడుస్తూ ఉండను. ఎక్కువ వన్డేలు ఆడనంత మాత్రాన నాలో పస లేదని కాదు. నాకు చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా బోలెడు టీ20 క్రికెట్ మిగిలి ఉంది’ అని లివింగ్‌స్టోన్ తెలిపాడు.
టీ20ల్లో విధ్వంసక ఇన్నింగ్స్‌లు పెట్టింది పేరైన లివింగ్‌స్టోన్ 2017లో జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి ఇప్పటివరకూ అతడు 49 టీ20లు ఆడాడంతే. పొట్టి ఫార్మాట్లో విజయవంతం కావడంతో ఆ తర్వాత వన్డేల్లో అవకాశం దక్కించుకున్నాడు. కానీ, వన్డేల విషయానికొస్తే.. 25 మ్యాచ్‌లకే పరిమితమైన అతడి సగటు 29.37 మాత్రమే.
ఇంగ్లండ్ తరఫున టీ20ల్లో రాణిస్తున్న లివింగ్‌స్టోన్ ఫ్రాంచైజీ క్రికెట్లో అదరగొడుతున్నాడు. ఐపీఎల్లో పాపులర్ అయ్యాడు. 2021లో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)కు ఆడిన ఈ ఆల్‌రౌండర్ ఆ తర్వాత పంజాబ్ కింగ్స్(Punjab Kings)కు మారాడు. 2022 వేలంలో పంజాబ్ అతడిని రూ.11.50 కోట్ల భారీ ధరకు కొన్నది.