జలంధర్ : భారత దిగ్గజ అథ్లెట్ ఫౌజా సింగ్ కన్నుమూశారు. జలంధర్ సమీపంలోని బియాస్ పిండ్ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 114 ఏండ్ల ఫౌజా సింగ్ తుదిశాస్వ విడిచారు. సోమవారం మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో రోడ్డు దాటుతుండగా, గుర్తు తెలియని వాహనం బలంగా ఢీకొట్టడంతో ఫౌజాసింగ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. దగ్గరలోని ప్రైవేట్ దవాఖానకు తరలించినా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ప్రపంచంలోనే కురువృద్ధ అథ్లెట్‌గా పేరుగాంచిన ఈ పంజాబ్ పుత్తర్ ఎందరికో స్ఫూర్తిగా నిలిచారు. వందేండ్ల వయసును ఏమాత్రం లెక్కచేయకుండా యువకులకు సవాలు విసురుతూ ప్రపంచ వ్యాప్తంగా వివిధ మారథాన్లలో బరిలోకి దిగి సత్తాచాటారు. ఫౌజా సింగ్ మృతి పట్ల పలు ప్రపంచ దేశాలు తమ దిగ్భ్రాంతి ప్రకటించాయి. 1911 ఏప్రిల్ 1న జన్మించిన ఫౌజాసింగ్ 89 ఏండ్ల వయసులో అథ్లెటిక్స్ కెరీర్ మొదలుపెట్టారు.
1993లో ఇంగ్లండ్‌కు వెళ్లిన ఈ దిగ్గజ అథ్లెట్.. ‘టర్బన్ టోర్నడో’ అంటూ అందరి మనన్నలు పొందారు. 2011లో జరిగిన టొరంటో మారథాన్‌లో 100 ఏండ్ల వయసులో 8 గంటల 11 నిమిషాల్లో రేసు పూర్తి చేసి కొత్త రికార్డు నెలకొల్పాడు. ఐదేండ్ల పసిప్రాయం వరకు నడవని ఆయన.. తన 14 ఏండ్ల అథ్లెటిక్స్ కెరీర్లో తొమ్మిది మారథాన్ రేసుల్లో పోటీపడటం విశేషం. తన కుటుంబసభ్యుల మరణాల నుంచి తేరుకునేందుకు పరుగును ఎంచుకున్న ఫౌజాసింగ్ను 2015లో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ వరించింది. 2012లో జరిగిన హాంకాంగ్ మారథాన్.. ఆయన చివరి అంతర్జాతీయ రేసుగా నిలిచింది. పంజాబ్‌లో డ్రగ్స్ నియంత్రణకు అక్కడి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో ఈ దిగ్గజ అథ్లెట్ కీలకంగా వ్యవహరించారు. కనీసం నడిచే వీలు లేని వయసులో కుర్రాళ్లకు స్ఫూర్తిగా నిలిచిన ఫౌజాసింగ్ అకాల మృతి అందరినీ కలిచివేసింది.