WPL 2024 | ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) రెండో సీజన్ ముగింపు దశకు చేరుకుంది. నేటితో ఈ సీజన్లో లీగ్ దశ ముగియనుండగా ఈ మ్యాచ్ తర్వాత మరో రెండు మ్యాచ్‌లు మాత్రమే మిగిలుంటాయి. ఆఖరి మ్యాచ్‌లో టేబుల్ టాపర్స్‌గా ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్.. చిట్టచివరన ఉన్న గుజరాత్ జెయింట్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో బెత్ మూనీ సారథ్యంలోని గుజరాత్.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఢిల్లీ క్యాపిట్స్ మొదట బౌలింగ్ చేయనుంది. సీజన్ ఆరంభంలో విఫలమైనా గుజరాత్.. తాము ఆడిన చివరి మూడు మ్యాచ్‌లలో మాత్రం మెరుగ్గా రాణిస్తోంది. చివరి మ్యాచ్‌లో గుజరాత్.. ఢిల్లీని ఓడించి విజయంతో ఈ సీజన్‌ను ముగించాలని భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో గెలిచినా, ఓడినా గుజరాత్‌కు పోయేదేం లేదు. ఇప్పటికే ఆ జట్టు రెండో సీజన్లో ఎలిమినేట్ అయింది. మంగళవారం ఆర్సీబీ.. ముంబై ఇండియన్స్‌ను ఓడించడంతో ఆ జట్టు ప్లేఆఫ్స్ చేరిన మూడో జట్టుగా నిలవడంతో యూపీ వారియర్స్, గుజరాత్ జెయింట్స్‌లు ఎలిమినేట్ అయ్యాయి. కాగా నేటి మ్యాచ్ ఫలితంతో గుజరాత్‌కు వచ్చేదేమీ లేకపోయినా ఢిల్లీకి మాత్రం గెలిస్తేనే నేరుగా ఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంటుంది.
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్.. ఏడు మ్యాచ్‌లు ఆడి ఐదు గెలిచి రెండింట్లో ఓడిపోయింది. ఆ జట్టు ఖాతాలో పది పాయింట్లున్నాయి. రెండో స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్.. 8 మ్యాచ్‌లు ఆడి 5 గెలిచి మూడింట్లో ఓడింది. ఆ జట్టుకూ పది పాయింట్లే ఉన్నాయి. కానీ ఢిల్లీ నెట్ రన్ రేట్ (+0.918).. ముంబై (+0.024) కంటే మెరుగ్గా ఉంది. ఒకవేళ నేటి మ్యాచ్‌లో గుజరాత్ గనక ఢిల్లీకి షాకిస్తే అప్పుడు ఆ జట్టు నెట్ రన్‌రేట్ కూడా తగ్గనుంది. అలాంటప్పుడు ఢిల్లీ రెండో స్థానానికి వెళ్లాల్సి ఉంటుంది. రెండో స్థానంలో నిలిచిన జట్టు.. ఈ నెల 15న ఆర్సీబీతో ఎలిమినేటర్ ఆడాల్సి ఉంటుంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న జట్టు నేరుగా ఫైనల్ ఆడుతుంది.