లండన్ : ఐపీఎల్ ఫౌండర్, తొలి చైర్మన్ లలిత్ మోదీ 16 ఏండ్ల విరామం తర్వాత భారత్ తిరిగి రానున్నాడు. 2009లో దక్షిణాఫ్రికా ఆతిథ్యం ఇచ్చిన ఐపీఎల్ సందర్భంగా నమోదైన విదేశీ మారకద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కేసులో అప్పిలేట్ ట్రైబ్యునల్ నుంచి తనకు ఊరట లభించడంతో ఈ ఏడాది చివర్లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో స్వదేశానికి తిరిగొస్తున్నట్లు అతను వెల్లడించాడు. 2010 నుంచి విదేశాల్లో నివసిస్తున్న లలిత్ తన సుదీర్ఘ న్యాయపోరాటంలో చివరకు నిజమే గెలిచిందని వ్యాఖ్యానించాడు.
ట్రైబ్యునల్ తీర్పు తనకు ఎంతో ఊరటనిచ్చిందని, తాను ఎల్లప్పుడూ ఐపీఎల్ శ్రేయస్సు కోసమే పనిచేశానని స్పష్టం చేశాడు. కాగా, 2009 ఐపీఎల్ సీజన్ నిధుల బదిలీ వ్యవహారంలో లలిత్ మోదీ ఫెమా నిబంధనలను ఉల్లంఘించాడనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని అప్పిలేట్ ట్రైబ్యునల్ తన తీర్పులో స్పష్టం చేసింది. గతంలో ఈడీ మోపిన అభియోగాలు, జరిమానాలను పక్కనబెడుతూ ఈనెల 16న ఈ తీర్పునిచ్చింది. 2009 ఐపీఎల్ టైమ్‌లో ఆర్బీఐ ముందస్తు అనుమతి లేకుండా నిధులు విదేశాలకు మళ్లించారంటూ లలిత్‌పై ఈడీ కేసు నమోదు చేసింది.