Canada Open 2023 | న్యూఢిల్లీ: యువ భారత షట్లర్ లక్ష్యసేన్.. కెనడా ఓపెన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకోలేకపోయిన లక్ష్య.. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 ట్రోఫీ చేజిక్కించుకున్నాడు. పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్య 21-18, 22-20తో ఆల్ ఇంగ్లండ్ చాంపియన్ లీ షి ఫెంగ్ (చైనా)పై విజయం సాధించాడు.
హోరాహోరీగా సాగిన పోరులో ఏమాత్రం వెనక్కి తగ్గని 21 ఏండ్ల లక్ష్య.. ప్రత్యర్థి నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైనా వరుస గేమ్‌ల్లో మ్యాచ్‌ను ముగించాడు. నిరుడు బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం లక్ష్యసేన్‌కు ఇదే తొలి టైటిల్ కావడం విశేషం. ‘ఒలింపిక్ క్వాలిపికేషన్ ఇయర్లో ఈ విజయం నా ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. గత కొన్ని మ్యాచ్‌లుగా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయా. ఈ వారం అద్భుతంగా గడిచింది. నా ఆటతీరుతో సంతృప్తిగా ఉన్నా. ఇదే జోరు కొనసాగించాలనుకుంటున్నా’ అని లక్ష్య పేర్కొన్నాడు.