సిడ్నీ: భారత యువ షట్లర్ లక్ష్యసేన్ ఈ సీజన్లో తొలి టైటిల్‌తో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో లక్ష్యసేన్ 21-15, 21-11తో యుశి తనాక (జపాన్)పై అద్భుత విజయం సాధించాడు. 38 నిమిషాల్లోనే ముగిసిన తుది పోరులో 26 ఏండ్ల సేన్ వరుస గేముల్లో ప్రత్యర్థిని చిత్తుచేశాడు. తద్వారా టైటిల్ కరువుకు ఆస్ట్రేలియన్ ఓపెన్ విజయంతో చెక్ పెట్టాడు. ఇక ఫైనల్ పోరు విషయానికొస్తే ప్రపంచ నంబర్26 షట్లర్ యుశి తనాకపై సేన్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మ్యాచ్‌పై పట్టు నిలుపుకుంటూ కచ్చితమైన ప్లేస్‌మెంట్స్‌తో షాట్లు కొట్టడం ఈ యువ షట్లర్‌కు బాగా కలిసొచ్చింది.
తొలి గేమ్‌లో 6-3తో ఆధిక్యం కనబరిచిన సేన్.. ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడుతూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. తొలి గేమ్ దూకుడును కీలకమైన రెండో గేమ్‌లోనూ కొనసాగిస్తూ డ్రాప్షాట్లు, నెట్‌గేమ్‌తో అలవోకగా కైవసం చేసుకుని విజేతగా నిలిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత స్పందిస్తూ ‘ఈ సీజన్లో చాలా ఎత్తుపల్లాలు చూశాను. ఓవైపు గాయాలకు తోడు సరైన ఫలితాలు రాక నిరాశ ఎదురైనా ఆత్మవిశ్వాసం కోల్పోలేదు. విజయంతో సీజన్‌ను ముగించడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నాడు.