ఢిల్లీ : స్వదేశంలో మంగళవారం నుంచి మొదలైన బీడబ్ల్యూఎఫ్ ఇండియా ఓపెన్ సూపర్ 750 టోర్నీలో భారత స్టార్ షట్లర్ లక్ష్యసేన్ తొలి రౌండ్లో శుభారంభం చేశాడు. పురుషుల సింగిల్స్‌లో లక్ష్య.. 21-12, 21-15తో భారత్‌కే చెందిన అయూశ్ శెట్టిపై గెలిచాడు. పూర్తి ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో లక్ష్య.. నెట్ గేమ్‌తో అయూశ్కు చెక్ పెట్టాడు. పురుషుల డబుల్స్‌లో హరిహరన్-అర్జున్ ద్వయం.. 21-15, 21-18తో మలేషియాకు చెందిన మాజీ ప్రపంచ చాంపియన్ జోడీ ఆంగ్ యి సిన్- టియో యె యి పై సంచలన విజయాన్ని నమోదుచేసింది. మహిళల డబుల్స్‌లో త్రిసా జాలీ-గాయత్రి గోపిచంద్ జంట.. 21-15, 21-11తో ఆర్నిచ-సుకిత (థాయ్‌లాండ్)ను ఓడించి రెండో రౌండ్‌కు చేరింది.
ఇండియా ఓపెన్‌కు ఆతిథ్యమిస్తున్న ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇండోర్ స్టేడియంలో వసతులపై డెన్మార్క్ షట్లర్, ప్రపంచ 20వ ర్యాంకర్ మియా బ్లిచ్‌ఫీల్డ్ విమర్శలు గుప్పించింది. గత సీజన్ కంటే ఇక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాయని తాను ఆశించానని, కానీ వాటిలో ఏ మార్పూ లేదని ఆమె విమర్శించింది. ప్రాక్టీస్ చేసే కోర్టు పైన పక్షులు తిరుగుతూ అక్కడే విసర్జిస్తున్నాయని, అది ఆటగాళ్ల ఆరోగ్యానికి ఎంతమాత్రమూ మంచిది కాదని ఆమె తెలిపింది.