బర్మింగ్‌హామ్: బ్యాడ్మింటన్‌లో అత్యంత పురాతన, ప్రతిష్టాత్మక టోర్నీ అయిన ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన భారత్ ఆశలు క్వార్టర్ ఫైనల్లోనే అడియాశలయ్యాయి. స్టార్ షట్లర్లంతా ఆరంభ రౌండ్లలోనే నిష్క్రమించినా పురుషుల సింగిల్స్‌లో క్వార్టర్స్ చేరిన లక్ష్యసేన్‌తో పాటు మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపీచంద్-త్రిసా జాలీ పోరాటం ముగిసింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్స్‌లో లక్ష్య.. 10-21, 16-21తో ప్రపంచ ఆరో ర్యాంకర్ లి షి ఫెంగ్ (చైనా) చేతిలో ఓడిపోయాడు. తొలి గేమ్‌ను 17 నిమిషాల్లోనే గెలుచుకున్న ఫెంగ్ 45 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించాడు. ఫెంగ్ జోరు ముందు లక్ష్య తేలిపోయాడు. గాయత్రి-త్రిసా ద్వయం.. 14-21, 10-21తో లి షెంగ్షూ-టన్ నింగ్(చైనా) జోడి చేతిలో ఓటమిపాలైంది.