అడిలైడ్: వన్‌డౌన్ బ్యాటర్ మార్నస్ లబుషేన్ (120 బ్యాటింగ్) హ్యాట్రిక్ సెంచరీతో కదం తొక్కడంతో వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ భారీ స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కంగారూలు గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్ల నష్టానికి 330 రన్స్ చేశారు. గత మ్యాచ్‌లో రెండు సెంచరీలు (అందులో ఒకటి ద్విశతకం) చేసిన లబుషేన్‌కు ఇది వరుసగా మూడో శతకం కాగా ట్రావిస్ హెడ్ (114 బ్యాటింగ్) కూడా మూడంకెల స్కోరు చేశాడు.