ముంబై: స్టార్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఆదివారం లక్నోతో పోరులో రిటైర్డ్ ఔట్గా వెనుదిరగడంపై రాజస్థాన్ రాయల్స్ కోచ్ కుమార సంగక్కర హర్షం వ్యక్తం చేశాడు. అశ్విన్ ఇలా చేయడం ద్వారా ఐపీఎల్ చరిత్రలో రిటైర్డ్ ఔట్గా పెవిలియన్ చేరిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోకెక్కిన విషయం తెలిసిందే. ఈ అంశంపై సంగక్కర మాట్లాడుతూ.. ‘రిటైర్డ్ ఔట్గా వెనుదిరుగుతానని అశ్విన్ మైదానం నుంచే మమ్మల్ని అడిగాడు. దీంతో అప్పటికప్పుడు మేం చర్చించుకొని ఆ నిర్ణయం తీసుకున్నాం. సరైన సమయంలో అతడు సరైన విధంగా ఆలోచించాడు. జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో పదో ఓవర్లో క్రీజులోకి అడుగుపెట్టిన అశ్విన్ పరిస్థితులను అర్థం చేసుకొని ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఆడాడు. చివరికి తనంతట తానే రిటైర్డ్ ఔట్గా వెనుదిరుగుతానని చెప్పాడు.