హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): కష్టాల్లో ఉన్న ప్రతిభావంతులకు అండగా నిలువడంలో తాను ఎప్పుడూ ముందే ఉంటానని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి నిరూపించారు. నల్లగొండ జిల్లాకు చెందిన పేద యువ సైక్లిస్ట్ రమ్యసైదులుకు అంతర్జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేందుకు అవసరమైన రూ.10 లక్షల విలువైన ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్‌ను అందజేసి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. కేటీఆర్ నేతృత్వంలోని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం స్ఫూర్తితో ఈ సాయం అందించి, రమ్య అంతర్జాతీయ కలలకు రెకలు తొడిగారు.
నల్లగొండ జిల్లా కంచనపల్లి గ్రామానికి చెందిన రమ్య చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కష్టాలు వెంటాడినప్పటికీ, సైక్లింగ్‌పై మకువతో అలుపెరగకుండా శ్రమించింది. పట్టుదలతో రాష్ట్ర, జాతీయస్థాయి సైక్లింగ్ పోటీల్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి గుర్తింపు తెచ్చుకున్నది. అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలు, ఒలింపిక్స్ లో దేశానికి ప్రాతినిధ్యం వహించి పతకం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నది. అంతర్జాతీయ స్థాయి పోటీల్లో తలపడాలంటే సాధారణ సైకిల్ సరిపోదు. ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్ అవసరం. మారెట్లో దాని ధర సుమారు రూ.10 లక్షల వరకు ఉండటంతో, అంత పెద్ద మొత్తాన్ని భరించడం రమ్య కుటుంబానికి సాధ్యం కాలేదు. సాయం కోసం ఆమె ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగినా స్పందన లభించక నిరాశ చెందింది.
ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రమ్యకు కేటీఆర్ రూపంలో ఒక ఆశాకిరణం లభించింది. ఇటీవల జరిగిన ‘డాక్టర్స్ క్రికెట్ అవార్డ్స్’ కార్యక్రమంలో పాల్గొన్న రమ్య, అకడ కేటీఆర్‌ను కలిసి తన దీనస్థితిని వివరించింది. దేశం కోసం ఒలింపిక్స్‌లో ఆడాలన్న తన కలకు ప్రొఫెషనల్ సైకిల్ కొరత అడ్డంకిగా మారిందని అభ్యర్థించింది. రమ్యలోని పట్టుదలను చూసి చలించిపోయిన కేటీఆర్.. కచ్చితంగా సాయం అందిస్తానని ఆమెకు హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట మేరకు శనివారం తెలంగాణభవన్‌లో ఆమెకు ప్రొఫెషనల్ రేసింగ్ సైకిల్‌ను అందజేశారు.
కేటీఆర్ పిలుపునిచ్చిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం ద్వారా ప్రేరణ పొంది నల్లగొండ జిల్లాకే చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీరెడ్డి, వారి కుటుంబానికి చెందిన హెర్మియోన్ డనన్రెడ్డి ఫౌండేషన్ ద్వారా రమ్యకు కావాల్సిన రేసింగ్ సైకిల్‌ను కొనుగోలు చేసి అందజేశారు. రమ్య క్రీడా ప్రగతికి పేదరికం అడ్డంకి కాబోదని చాటిచెప్పారు. నాయకత్వం అంటే కేవలం పదవులు అనుభవించడం కాదని, ఆపదలో ఉన్న ప్రజల పక్షాన, ప్రతిభ పక్షాన నిలబడటమేనని కేటీఆర్ ఈ సాయం ద్వారా మరోసారి నిరూపించారు. ‘మీరు స్వేచ్ఛగా కలలు కనండి. వాటి సాధన కు పట్టుదలగా శ్రమించండి. సమాజం నుంచి సరైన మద్దతు తోడై ఆ కలలు కచ్చితంగా నిజమవుతాయి’ అని కేటీఆర్ పేర్కొన్నారు.