Kirsty Coventry | కోస్టా నవారీనో(గ్రీస్): అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐవోసీ) కొత్త శకం ఆరంభం కాబోతున్నది. జింబాబ్వేకు చెందిన రెండు సార్లు ఒలింపిక్స్ స్వర్ణ విజేత క్రిస్టీ కోవెంట్రీ ఐవోసీ నూతన అధ్యక్షురాలిగా ఎన్నికైంది. గురువారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో క్రిస్టీ విజయానికి అవసరమైన 49 ఓట్లు దక్కించుకుని విజేతగా నిలిచింది. దీంతో 131 ఏండ్ల సుదీర్ఘ చరిత్ర కల్గిన ఐవోసీలో తొలి మహిళా అధ్యక్షురాలిగా క్రిస్టీ కోవెంట్రీ అరుదైన ఘనత సొంతం చేసుకుంది.
మొత్తం 97 మంది ఐవోసీ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనగా, జువాన్ అంటానియో సమరంచ్కు 28 ఓట్లు, సెబాస్టియన్ కో 8 ఓట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. 12 ఏండ్ల పాటు ఐవోసీ బాస్‌గా వ్యవహరించిన థామస్ బాచ్ స్థానంలో క్రిస్టీ కోవెంట్రీ బాధ్యతలు స్వీకరించనుంది. లాస్ఎంజిల్(2028) ఒలింపిక్స్ నిర్వహణతో పాటు 2036 ఒలింపిక్స్ ఆతిథ్య హక్కుల కోసం భారత్, మిడిల్ఈస్ట్ పోటీపడుతున్న నేపథ్యంలో క్రిస్టీ కీలక సవాళ్లు ఎదుర్కొనే అవకాశముంది.