IPL 2024 : ఐపీఎల్ పదిహేడో సీజన్లో ఇక ప్రతీకార మ్యాచ్‌లకు తెరలేవనుంది. చిన్నస్వామిలో కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) చేతిలో కంగుతిన్న రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(Royal Challengers Bengaluru) విజయంపై కన్నేసింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా ఆదివారం మధ్యాహ్నం జరిగే పోరు కోసం ఇరుజట్ల ఆటగాళ్లు నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు. మరికొన్ని గంటల్లో మ్యాచ్ షురూ కానుందనగా.. విరాట్ కోహ్లీ బ్యాట్‌ను రింగూ సింగ్ విరగ్గొట్టాడు.
అంతేకాదు.. తనకు మరొక బ్యాట్ ఇవ్వాల్సిందిగా విరాట్‌ను కోరాడు. ఈ ఇద్దరి మధ్య జరిగిన ఈ ఆసక్తికర సంభాషణ వీడియోను కోల్‌కతా తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. అసలేం జరిగిందంటే..? పదిహేడో సీజన్ 10వ మ్యాచ్‌లో కోల్‌కతా 7 వికెట్ల తేడాతో బెంగళూరును చిత్తు చేసింది. ఆ మ్యాచ్ తర్వాత విరాట్ తన బ్యాట్‌ను రింకూకు బహుమతిగా ఇచ్చాడు.
అయితే.. ఆ బ్యాట్‌ను రింకూ ఈ మధ్యే విరగ్గొట్టాడు. ఆదే విషయాన్ని కోహ్లీకి రింకూ వివరించాడు. స్పిన్నర్‌ను ఎదుర్కొనేటప్పుడు బ్యాట్ విరిగిపోయిందని చెప్పాడు. అంతేకాదు తనకు కొత్త బ్యాట్ ఇవ్వాల్సిందిగా కోహ్లీని అభ్యర్థించాడు. అయితే.. అందుకు విరాట్ నీకు మ్యాచులకు రెండు బ్యాట్లు ఇచ్చాననుకో.. మెగా టోర్నీలో నువ్వే ఇబ్బంది పడతావు అంటూ కోహ్లీ ఫన్నీగా బదులిచ్చాడు.
“Virat bhai ne ek bat diya thha… jo bat diya thha, woh mere se toot gaya” 😂 pic.twitter.com/qoJWWs2fik
— KolkataKnightRiders (@KKRiders) April 21, 2024
పదిహేడో సీజన్లో కోల్‌కతా 5 విజయాలు సాధించగా.. ఆర్సీబీ ఒకే ఒక విక్టరీ కొట్టింది. ప్లే ఆఫ్స్ రేసులో వెనకబడిన బెంగళూరు ఇక వరుసగా ఏడు మ్యాచుల్లో గెలిస్తేనే రేసులో ఉంటుంది. అయితే.. సొంతమైదానంలో రెచ్చిపోయి ఆడే కోల్‌కతా ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్, హిట్టర్లు ఆండ్రూ రస్సెల్, రింకూ సింగ్‌లను కట్టడి చేయడం బౌలింగ్‌లో ఏమంత పసలేని డూప్లెసిస్ సేనకు శక్తికిమించిన పనే.