హైదరాబాద్, ఆట ప్రతినిధి: వరుసగా ఐదు విజయాలతో దూసుకెళ్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ జైత్రయాత్రకు బ్రేక్ పడింది. భారీస్కోర్లతో చెలరేగుతూ.. ప్లేఆఫ్స్ దిశగా ముందుకెళ్తున్న సన్‌రైజర్స్ సొంతగడ్డపై కోల్‌కతా నైట్ రైడర్స్ మిస్టరీ స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి (3/36), సునీల్ నరైన్ (2/31) మ్యాజిక్‌ను ఎదుర్కోలేక చతికిల పడింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 7 వికెట్ల తేడాతో కేకేఆర్ చేతిలో ఓడిపోయింది. తొలుత సన్‌రైజర్స్ 19 ఓవర్లలో165 పరుగులకే ఆలౌటైంది.
ఓపెనర్ ట్రావిస్ హెడ్ (28 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 61), ఇషాన్ కిషన్ (29 బంతుల్లో 4ఫోర్లు, 2 సిక్సర్లతో42)రాణించినా..మిగతా బ్యాటర్లు నిరాశపరిచారు. కార్తీక్ త్యాగి (2/30) రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత కోల్‌కతా 18.2 ఓవర్లలోనే 169/3 స్కోరు చేసి గెలిచింది. యువ బ్యాటర్ అంగ్క్రిష్ రఘువంశీ (47 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 59), కెప్టెన్ అజింక్యా రహానే (36 బంతుల్లో 4ఫోర్లు, 1 సిక్స్‌తో 43) సత్తాచాటారు. కోల్‌కతాకు ఇది మూడో విజయం. వరుణ్ చక్రవర్తికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. బుధవారం ఉప్పల్లోనే జరిగే తర్వాతి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది.
టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ తొలి పది ఓవర్లలో దూకుడుగానే ఆడినా.. రెండో భాగంలో వరుస వికెట్లు కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది. మొదట ఓపెనర్లు అభిషేక్ శర్మ (15), ట్రావిస్ హెడ్ తొలి వికెట్‌కు 44 రన్స్ జోడించి మంచి ఆరంభం ఇచ్చారు. తొలి ఓవర్లోనే స్పిన్నర్ నరైన్‌కు అభి సిక్స్‌తో స్వాగతం పలకగా.. రెండో ఓవర్లో నాలుగు ఫోర్లు కొట్టిన హెడ్.. నరైన్ బౌలింగ్‌లో 6,4 రాబట్టాడు. కార్తీక్ త్యాగి వేసిన నాలుగో ఓవర్లో గ్రీన్‌కు సింపుల్ క్యాచ్ ఇచ్చి అభి ఔటైనా.. వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌తో కలిసి హెడ్ దూకుడు కొనసాగించాడు. గ్రీన్ బౌలింగ్‌లో హెడ్ హ్యాట్రిక్ ఫోర్లు కొడితే.. కార్తీక్ ఓవర్లో ఇషాన్ 6,4 బాదడంతో పవర్‌ప్లేలోనే సన్‌రైజర్స్ 77/1తో నిలిచింది. 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్న హెడ్ చక్రవర్తి వేసిన తొమ్మిదో ఓవర్లో 4,4,6తో మరింత వేగం పెంచాడు.
కానీ, తెలివైన బంతితో అతడిని ఔట్ చేసిన చక్రవర్తి రెండో వికెట్‌కు 61 పరుగుల భాగస్వామ్యాన్ని ముగించాడు. ఇక్కడి నుంచి కేకేఆర్ బౌలర్లు జోరు పెంచి వరుస వికెట్లతో రైజర్స్ స్పీడుకు బ్రేకులు వేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న క్లాసెన్(11) గ్రీన్ బౌలింగ్‌లో పావెల్ పట్టిన అద్భుత క్యాచ్‌కు పెవిలియన్ చేరాడు. తన వరుస ఓవర్లలో రవిచంద్రన్ స్మరణ్ (4),అనికేత్ వర్మ (6)ను చక్రవర్తి పెవిలియన్ చేర్చడంతో రైజర్స్ 135/5తో డీలా పడింది. ఈ దశలో మళ్లీ బౌలింగ్‌కు వచ్చిన నరైన్ 16వ ఓవర్లో సాలిల్ అరోరా (2), ఇషాన్ ఇద్దరినీ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టును మరింత దెబ్బకొట్టాడు. కెప్టెన్ కమిన్స్ (10), శివంగ్కుమార్ (1)నిరాశపరచగా.. హర్షల్ పటేల్ (6)ను త్యాగి ఆఖరి వికెట్‌గా ఔట్ చేయడంతో సన్‌రైజర్స్ ఆలౌటైంది.
సాధారణ లక్ష్యాన్ని కేకేఆర్ పెద్దగా కష్టపడకుండానే ఛేదించింది. కెప్టెన్ రహానె ఇన్నింగ్స్ తొలి బంతినే బౌండరీకి చేర్చి వేగంగా ఆడాడు.. మరో ఓపెనర్ ఫిన్ అలెన్ (29 ఉన్నది కొద్దిసేపే అయినా తన మార్కు హిట్టింగ్తో అలరించాడు. కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో ఖతర్నాక్ షాట్లతో 6, 6,4,4 కొట్టిన అతను ఆఖరి బాల్‌కు క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చాడు. వన్‌డౌన్‌లో వచ్చిన అంగ్క్రిష్ రఘువంశీ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఈషాన్ మలింగ వేసిన ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టి పవర్‌ప్లేను 71/1తో ముగించాడు. ఫీల్డింగ్ విస్తరించిన తర్వాత సన్‌రైజర్స్ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసినా..రహానే, రఘు క్రమం తప్పకుండా బౌండరీలు కొడుతూ లక్ష్యాన్ని కరిగించారు. ఈ క్రమంలో రఘువంశీ 39 బంతుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. మరో ఎండ్‌లో హాఫ్ సెంచరీకి చేరువైన రహానేను 15వ ఓవర్లో సాకిబ్ హుస్సేన్ ఔట్ చేయడంతో రెండో వికెట్‌కు 84 పరుగుల భాగస్వామ్య ముగిసింది. విజయం ముంగిట రఘు కూడా పెవిలియన్ చేరినా.. మలింగ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టిన రింకూ సింగ్ (22 నాటౌట్) మ్యాచ్ ముగించాడు.
200 కేకేఆర్ స్పిన్నర్ సునీల్ నరైన్ ఐపీఎల్లో200 వికెట్ల మైలురాయిని అధిగమించాడు. ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా భువనేశ్వర్, యుజ్వేంద్ర చహల్ సరసన చేరాడు.
1 ఈ సీజన్లో 10 మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ ఆలౌట్ అవ్వడం ఇదే తొలిసారి.
హైదరాబాద్: 19 ఓవర్లలో 165 ఆలౌట్ (హెడ్ 61, ఇషాన్ 42, చక్రవర్తి 3/36, నరైన్ 2/31);
కోల్‌కతా: 18.2 ఓవర్లలో 169/3 (రఘువంశీ 59, రహానే 43, సాకిబ్ 1/17)