పరుగుల యంత్రం విరాట్ కోహ్లీకి మరోసారి నిరాశ ఎదురైంది! అందని ద్రాక్షలా ఊరిస్తూ వస్తున్న ఐపీఎల్ టైటిల్ ఈసారి కూడా దూరమైంది! స్పిన్నర్లు రాజ్యమేలిన లో స్కోరింగ్ మ్యాచ్‌లో కోహ్లీ ఆశలపై సునీల్ నరైన్ నీళ్లు చల్లాడు. మొదట బంతితో మ్యాజిక్ చేసిన ఈ విండీస్ స్పిన్నర్.. కోహ్లీ, డివిలియర్స్, మ్యాక్స్‌వెల్, శ్రీకర్ భరత్ వికెట్లు పడగొట్టడంతో పాటు.. బ్యాటింగ్‌లో ఎదుర్కొన్న తొలి మూడు బంతులకు భారీ సిక్సర్లు బాది మ్యాచ్‌ను లాగేసుకున్నాడు. ఈ సీజన్ తర్వాత బెంగళూరు కెప్టెన్సీ పగ్గాలు వదలేయనున్నట్లు ముందే ప్రకటించిన కోహ్లీ ఉత్తచేతులతోనే వెనుదిరగగా.. ఉత్కంఠ పోరులో ఒత్తిడిని జయించిన కోల్‌కతా.. బుధవారం జరుగనున్న క్వాలిఫయర్-2లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది!
షార్జా: భారీ స్కోరు చేయడంలో విఫలమైన బెంగళూరు ఐపీఎల్-14వ సీజన్లో తమ పోరాటాన్ని ముగించింది. కీలక సమయాల్లో ఆధిపత్యం కనబర్చిన కోల్‌కతా ముందడుగు వేయగా.. కోహ్లీ సేన ఇంటి బాట పట్టింది. నాలుగు ఓవర్లలో 21 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టిన సునీల్ నరైన్ (15 బంతుల్లో 26; 3 సిక్సర్లు) బ్యాటింగ్‌లోనూ మెరవడం కోల్‌కతాకు కలిసిరాగా.. విరాట్ కోహ్లీ మినహా తక్కినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోవడం బెంగళూరును దెబ్బకొట్టింది. దీంతో సోమవారం జరిగిన ఎలిమినేటర్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ 4 వికెట్ల తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేసింది. ఓపెనర్లు విరాట్ కోహ్లీ (39), దేవదత్
పడిక్కల్ (21) మినహా తక్కినవాళ్లంతా విఫలమవడంతో బెంగళూరు ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. కోల్‌కతా బౌలర్లలో సునీల్ నరైన్ 4, ఫెర్గూసన్ రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో మోర్గాన్‌సేన 19.4 ఓవర్లలో 6 వికెట్లకు 139 పరుగులు చేసింది. యువ ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (29), వెంకటేశ్ అయ్యర్ (26) రాణించగా.. నరైన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. బెంగళూరు బౌలర్లలో మహమ్మద్ సిరాజ్, హర్షల్ పటేల్, యుజ్వేంద్ర చాహల్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన నరైన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఐపీఎల్ 14వ సీజన్లో ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ఫైనల్‌కు చేరగా.. రెండో బెర్త్ కోసం బుధవారం ఢిల్లీతో మోర్గాన్ సేన అమీతుమీ తేల్చుకోనుంది.
స్పిన్ మాయాజాలం
పిచ్ బౌలింగ్‌కు సహకరించే అవకాశం ఉండటంతో.. టాస్ గెలువగానే కోహ్లీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. విరాట్, పడిక్కల్ సాధికారికంగా ఆడటంతో 5 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 49/0తో నిలిచింది. విరాట్ మంచి నిర్ణయమే తీసుకున్నాడనుకుంటున్న దశలో.. పడిక్కల్‌ను ఫెర్గూసన్ ఔట్ చేయగా.. అక్కడి నుంచి నరైన్ మాయాజాలం మొదలైంది. గత మ్యాచ్‌లో ఆఖరి బంతికి సిక్సర్ బాది జట్టును గెలిపించిన తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్ (9) ప్రభావం చూపలేకపోగా.. కాసేపటికి కోహ్లీ క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. ఈ రెండు వికెట్లు నరైన్ ఖాతాలోకే వెళ్లగా.. ఆదుకుంటాడనుకున్న మిస్టర్ 360 డివిలియర్స్ (11)తో పాటు ఆసీస్ ఆల్‌రౌండర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15)ను కూడా ఈ మిస్టరీ స్పిన్నర్ బుట్టలో వేసుకున్నాడు. ఇందులో కోహ్లీకి వేసిన బంతి సూపర్ అయితే.. డివిలియర్స్ ఔటైన బంతి ‘సూపర్ సే ఊపర్’ అని చెప్పాలి. కోహ్లీసేన ఒక దశలో 37 బంతుల పాటు ఒక్క బౌండ్రీ కూడా కొట్టలేకపోయిందంటే కోల్‌కతా బౌలింగ్ ఎంత కట్టుదిట్టంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు. నరైన్ (4/21), వరుణ్ చక్రవర్తి (0/20), షకీబల్ హసన్ (0/24) కలిసి 12 ఓవర్లలో 65 పరుగులు మాత్రమే ఇచ్చుకోగా.. అందులో కేవలం నాలుగు బౌండ్రీలు మాత్రమే ఉండటం గమనార్హం. ఫలితంగా బెంగళూరు ఆశించినదాని కంటే తక్కువ పరుగులకే పరిమితమైంది.
సిరాజ్ మెరిసినా..
సాధారణ లక్ష్యఛేదనలో కోల్‌కతాకు శుభారంభం దక్కింది. గిల్, వెంకటేశ్ ధాటిగా ఆడటంతో నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ సజావు గా సాగింది. తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించాక గిల్ ఔట్ కాగా.. రాహుల్ త్రిపాఠి (6) ఆకట్టుకోలేకపోయాడు. నితీశ్ రాణా (26) ఫర్వాలేదనిపించగా.. నరైన్ భారీ షాట్లతో విరుచుకుపడటంతో కోల్‌కతా పని సులువైంది. కోల్‌కతా విజయానికి 18 బంతుల్లో 15 పరుగులు చేయాల్సిన దశలో బంతినందుకున్న మహమ్మద్ సిరాజ్ ఒకే ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టి మ్యాచ్‌ను ఉత్కంఠ భరితంగా మార్చినా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (5 నాటౌట్), షకీబ్(9) పని పూర్తి చేశారు.
టర్నింగ్ పాయింట్
బౌలింగ్‌లో తన మాయాజాలంతో నాలుగు ప్రధాన వికెట్లు పడగొట్టిన సునీల్ నరైన్.. బ్యాటింగ్‌లోనూ అదరగొట్టాడు. కీలక సమయంలో క్రీజులో అడుగుపెట్టి తాను ఎదుర్కొన్న తొలి మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచి మ్యాచ్‌ను కోల్‌కతా వైపు తిప్పాడు. 11 ఓవర్లు ముగిసేసరికి 79/3తో నిలిచిన మోర్గాన్ సేన.. 54 బంతుల్లో 60 పరుగులు చేయాల్సిన దశలో నరైన్ బరిలోకి దిగాడు. గతంలో నైట్‌రైడర్స్ తరఫున ఓపెనర్‌గానూ ఆడిన అనుభవం ఉన్న నరైన్.. మీడియం పేసర్ క్రిస్టియాన్‌కు చుక్కలు చూపించాడు. 12వ ఓవర్ మూడో బంతిని ఫైన్ లెగ్ మీదుగా తరలించిన నరైన్.. మరుసటి బాల్‌ను డీప్ మిడ్‌వికెట్ మీదుగా ప్రేక్షకుల్లో పడేశాడు. ఆ తర్వాతి బంతిని లాంగాఫ్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు. నరైన్ ధాటికి క్రిస్టియాన్ రెండు వైడ్లు కూడా వేయగా.. ఓవరాల్‌గా ఈ ఓవర్లో 22 పరుగులు వచ్చాయి. ఫలితంగా 12వ ఓవర్ ముగిసేసరికి కోల్‌కతా విజయ సమీకరణం 48 బంతుల్లో 38కి చేరడంతో మిగిలిన ఆటగాళ్ల పని సులువైంది.
స్కోరు బోర్డు
బెంగళూరు: పడిక్కల్ (బి) ఫెర్గూసన్ 21, కోహ్లీ (బి) నరైన్ 39, భరత్ (సి) వెంకటేశ్ (బి) నరైన్ 9, మ్యాక్స్‌వెల్ (సి) ఫెర్గూసన (బి) నరైన్ 15, డివిలియర్స్ (బి) నరైన్ 11, షాబాజ్ (సి) మావి (బి) ఫెర్గూసన్ 13, క్రిస్టియాన్ (రనౌట్) 9, హర్షల్ (నాటౌట్) 8, గార్టన్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 13, మొత్తం: 138/7. వికెట్ల పతనం: 1-49, 2-69, 3-88, 4-102, 5-112, 6-126, 7-134, బౌలింగ్: షకీబ్ 4-0-24-0, మావి 4-0-36-0, వరుణ్ 4-0-20-0, ఫెర్గూసన్ 4-0-30-2, నరైన్ 4-0-21-4.
కోల్‌కతా: గిల్ (సి) డివిలియర్స్ (బి) హర్షల్ 29, వెంకటేశ్ (సి) భరత్ (బి) హర్షల్ 26, త్రిపాఠి (ఎల్బీ) చాహల్ 6, రాణా (సి) డివిలియర్స్ (బి) చాహల్ 23, నరైన్ (బి) సిరాజ్ 26, కార్తీక్ (సి) భరత్ (బి) సిరాజ్ 10, మోర్గాన్ (నాటౌట్) 5, షకీబ్ (నాటౌట్) 9, ఎక్స్‌ట్రాలు: 5, మొత్తం: 19.4 ఓవర్లలో 139/6. వికెట్ల పతనం: 1-41, 2-53, 3-79, 4-110, 5-125, 6-126, బౌలింగ్: సిరాజ్ 4-0-19-2, గార్టన్ 3-0-29-0, హర్షల్ 4-0-19-2, చాహల్ 4-0-16-2, మ్యాక్స్‌వెల్ 3-0-25-0, క్రిస్టియాన్ 1.4 -0-29-0.