బౌలర్ల క్రమశిక్షణకు బ్యాటర్ల సహకారం తోడవడంతో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదో విజయం నమోదు చేసుకుంది. వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ధాటికి పంజాబ్ ఓ మాదిరి స్కోరుకే పరిమితం కాగా.. నితీశ్ రాణా, జాసన్ రాయ్, రస్సెల్ వేగంగా ఆడటంతో కోల్‌కతా జయకేతనం ఎగరవేసింది. చివరి బంతికి బౌండ్రీ బాదిన రింకూ సింగ్ మరోసారి హీరో అయ్యాడు.
కోల్‌కతా: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 16వ సీజన్లో ఐదో విజయం నమోదు చేసుకుంది. సోమవారం జరిగిన పోరులో కోలకతా 5 వికెట్ల తేడాతో పంజాబ్ కింగ్స్‌ను చిత్తుచేసింది. మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. కెప్టెన్ శిఖర్ ధవన్ (47 బంతుల్లో 57; 9 ఫోర్లు, ఒక సిక్సర్) అర్ధశతకంతో రాణించాడు. షారుక్ ఖాన్ (8 బంతుల్లో 21 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), జితేశ్ శర్మ (21; 2 సిక్సర్లు), హర్‌ప్రీత్ బ్రార్ (17 నాటౌట్; 2 ఫోర్లు, ఒక సిక్సర్) విలువైన పరుగులు చేశారు.
కోల్‌కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3, హర్షిత్ రాణా రెండు వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో కోల్‌కతా సరిగ్గా 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది. కెప్టెన్ నితీశ్ రాణా (38 బంతుల్లో 51; 6 ఫోర్లు, ఒక సిక్సర్) హాఫ్‌సెంచరీ సాధించగా.. జాసెన్ రాయ్ (38; 8 ఫోర్లు), రస్సెల్ (23 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్సర్లు), రింకూ సింగ్ (10 బంతుల్లో 21; 2 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకున్నారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2 వికెట్లు పడగొట్టాడు. రస్సెల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. సీజన్లో భాగంగా మంగళవారం జరుగనున్న పోరులో ముంబైతో బెంగళూరు తలపడనుంది.
సంక్షిప్త స్కోర్లు
పంజాబ్: 179/7 (ధవన్ 57, షారుక్ ఖాన్ 21; వరుణ్ చక్రవర్తి 3/26, హర్షిత్ 2/33),
కోల్‌కతా: 182/5 (నితీశ్ 51, రస్సెల్ 42; రాహుల్ చాహర్ 2/23).
